హనుమకొండ, జనవరి 11 : ‘కార్మికుల శ్రమ దోపిడీకి కేంద్రం వత్తాసు పలుకుతున్నది. హకులను కాలరాసేందుకే కేంద్రం నూతన కార్మిక చట్టాలు తెచ్చింది. నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయబోమని తెలంగాణ సరారు తీర్మానించాలి. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వైఖరి చెప్పాలి’ అని ప్రణాళికా సంఘం మాజీ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఉద్యోగ, కార్మిక హకుల సాధన కోసం నిర్వహించిన జిల్లాస్థాయి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమం విత్తనం వరంగల్‌లో పడిందని, అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేసేవరకు జరిగే ఉద్యమం సైతం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని స్పష్టంచేశారు.
ఢిల్లీని రైతులు దిగ్బంధనం చేయడంతో వ్యవసాయ కార్మికులకు క్షమాపణ చెప్పి పార్లమెంటులో ఆమోదించిన బిల్లులను ఏ విధంగా రద్దు చేసుకున్నారో.. అదేవిధంగా ఈ కార్మిక చట్టాలను సైతం వెనకి తీసుకొనే వరకు పోరాటం చేయాలని, అవసరమైతే ఢిల్లీని దిగ్బంధించాలని పిలుపునిచ్చారు. కేంద్రం నాలుగు లేబర్ కోడ్లను కార్మికులపై బలవంతంగా రుద్దడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం 10 ఏండ్లలో పార్లమెంట్లో ఎలాంటి చర్చ లేకుండానే అనేక బిల్లులు, చట్టాలను ఏకపక్షంగా ఆమోదిస్తున్నదని ఆరోపించారు. ఈ కోడ్లను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వ్యతిరేకిస్తున్నా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు తన వైఖరి చెప్పలేదని విమర్శించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఓరుగల్లు నుంచే పోరాటం ప్రారంభిద్దామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఉద్యోగ, కార్మికులు పోరాడి సాధించుకున్న 49 కార్మిక చట్టాలను రద్దు చేసిందని మండిపడ్డారు. నూతన చట్టాల కారణంగా చిన్న తరహా పరిశ్రమల్లో పని చేసే కార్మికులు వారి హకులను కోల్పోయే ప్రమాదం ఉందని, పనిగంటలు సైతం పెరుగుతాయని తెలిపారు. కార్మికులు వారి హకుల కోసం నిరసనలు, ధర్నాలు చేయకుండా, ఉద్యోగాల్లోంచి తొలగించడం, పరిహారం కోసం అడిగే హకు లేకుండా చేసేలా నూతన కార్మిక చట్టాలను కేంద్రం రూపొందించిందని ఆరోపించారు. కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన ఫిబ్రవరి 12న చేపట్టనున్న దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.