హనుమకొండ చౌరస్తా, జనవరి 11 : ఓసీ ఈడబ్ల్యూఎస్ పటిష్ట అమలు కోసం జాతీయ, రాష్ట్రస్థాయి చట్టబద్ధతగల కమిషన్ ఏర్పాటు కోసం కలిసికట్టుగా ఉద్యమించాలని ఓసీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండ జిల్లా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడీ సంఘాల నాయకులతో ఏర్పడిన రాష్ట్ర ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఓసీల సింహగర్జన సమరభేరి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గోపు జయపాల్‌రెడ్డి, జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, బ్రాహ్మణ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై దుష్ప్రచారాన్ని ఆపాలని సూచించారు.
అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారు రిజర్వేషన్ల లేమి కారణంగా అటు సంక్షేమ ఫలాలు, ఇటు రాజకీయ పదవులు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై జరుగుతున్న అసత్య ప్రచారాలు, కొందరు తమ లబ్ధికోసం చేస్తున్న కుట్రలను సాగనివ్వబోమని స్పష్టంచేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓసీలను పలుచన చేయాలనే కుయుక్తులను సాగనివ్వబోమని హెచ్చరించారు.
ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్య, ఉద్యోగ, పోటీ పరీక్షల్లో వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. త్వరలో హైదరాబాద్‌లో లక్ష మందితో నగరభేరి మోగిస్తామని ప్రకటించారు. హనుమకొండ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓసీ పేదల కోసం, హకుల కోసం కొట్లాడాలని పిలుపునిచ్చారు. ఓసీ జేఏసీలోని ఇద్దరు ప్రతినిధులను ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లి సమస్యలపై మాట్లాడిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ మేయర్ తకళ్లపల్లి రాజేశ్వరరావు, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకుడు గట్టు మహేశ్‌బాబు, ఓసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.