న్యూఢిల్లీ, అక్టోబర్ 12: కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో, పాప్ స్టార్ కేటీ పెర్రీ పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్నారని చానాళ్లుగా ప్రచారం జరుగుతున్నది. ఇది నిజమనిపించేలా కాలిఫోర్నియా శాంతా బార్బరాలోని ఓ పడవలో వారిద్దరూ ముద్దు పెట్టుకుంటూ కనిపించిన చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆన్లైన్లో కనిపించిన ఈ చిత్రాలు వారిద్దరూ కలిసి మధ్యాహ్నం విశ్రాంతిగా గడుపుతున్నట్టు చూపిస్తూ వారి బంధంపై నెలల తరబడి జరుగుతున్న ఊహాగానాలకు తెర దించాయి.
ఈ చిత్రంలో నలుపు రంగు స్విమ్ సూట్లో ఉన్న ఫెర్రీని ఒంటిపై చొక్కా లేకుండా ఉన్న ట్రూడో కౌగిలించుకుని బుగ్గపై ముద్దుపెట్టుకుంటున్నారు. ఈ జంట తొలిసారిగా మాంట్రియల్లో జూలైలో జరిగిన ఒక డిన్నర్ డేట్లో కన్పించారు. నటుడు ఆర్లాండో బ్లూమ్తో ఈ ఏడాది జూన్లో కెటీ పెర్రీ తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. వీరిద్దరికి ఐదేండ్ల డైసీ డోవ్ అనే పాప ఉంది. జస్టిన్ ట్రూడో కూడా 18 ఏండ్ల వైవాహిక జీవితం అనంతరం భార్య సోఫి గ్రెగోరీ ట్రూడోతో 2023లో విడిపోయారు.