Afg vs Pak : అఫ్గానిస్థాన్ (Afghanistan), పాకిస్థాన్ (Pakistan) దేశాల సరిహద్దుల్లో ఇరు దేశాల సైన్యాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పాక్ సేనలు అఫ్గాన్ రాజధాని కాబూల్ (Kabul) పై దాడికి పాల్పడగా.. ప్రతీకారంగా తాలిబన్ సైన్యం పాక్ సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఈ క్రమంలో తాము 58 మంది పాకిస్థానీ సైనికులను మట్టుబెట్టామని అఫ్గానిస్థాన్ ప్రకటించింది.
ఇస్లామాబాద్ పదేపదే తమ సరిహద్దుల ఉల్లంఘనలకు పాల్పడిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు అఫ్గాన్ తెలిపింది. ఐసిస్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించొద్దని పాకిస్థాన్‌ను హెచ్చరించింది. కాబుల్‌తోపాటు ఓ మార్కెట్‌పై పాకిస్థాన్ బాంబు దాడులు చేసిందని ఇటీవల అఫ్గానిస్థాన్ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే పాక్ దళాలే లక్ష్యంగా ప్రతీకార దాడులు చేపట్టినట్లు తెలిపింది.
తమ సేనలు పొరుగు దేశానికి చెందిన 25 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. 58 మంది పాక్ సైనికులు మృతి చెందారని, మరో 30 మంది గాయపడ్డారని చెప్పారు. ఇటీవల కాబుల్‌లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) చీఫ్ నూర్ వాలి మెహ్సూద్ స్థావరం లక్ష్యంగా పాక్ యుద్ధవిమానాలు దాడి చేశాయి.