తెరలెత్తే కలల కన్నుల్లో
బుడి బుడి అడుగుల చిన్నతనం నుంచి
ఈతకొట్టీ మునకలేసిన
యవ్వన వీణియలు మోగించిన
ఒకానొక కాలం నుంచి
జ్ఞాపకాల సంచీ మోసిన యాది మరుపుల నుంచి
అమ్మ నడుముకు చెక్కుకునే చెయిసంచీ వరకు
ఎన్ని ఖర్చులు ఎన్ని జమలు?
ఐస్‌ఫ్రూట్ అమ్మకానికి వచ్చిందంటే చాలు
వంటింటి వైపు పరుగుల పరామర్శలు
భయం పక్కన నిలబడి బ్రతిమిలాటలు
పది పైసల బిళ్ళ చేయికంది ఐదు పైసల బిళ్ళను
అమాంతం మింగినట్టు
నాలుగు విషయాల నాలెడ్జ్ లేని ప్రాంతీయ లక్షణం
అసలు చైతన్యాన్ని మింగేది
బాపమ్మను బురిడీ కొట్టించిన
కొంటె కోణంగుల పాయాలు దాటి
చారణా ఆఠణాలు చేతులబడే సమయమొచ్చి
బడి దాటిన అవసరాలు ఎక్కువైన
పదకొండో తరగతి అరుగుల మీద నుంచి
పన్నెండుకు పయనమయ్యే చదువుల ముచ్చట్ల నుంచి
అమ్మాయిలు అబ్బాయిలు అంతరాలూ చేరువలూ
అపనమ్మకాలు అమాంతం పెరిగిన అనుభవాలూ
ఆశగా చూసిన అమాయకతలూ అనుమానాలు
అమ్మతనం వైపుకు తిరిగి
ఎన్నెన్ని ప్రశ్నల్ని కూడా దోపుకున్నదో చెయిసంచి
ఇత్తడి ఇరవై పైసలు పట్టా గొలుసులకూ పనికొచ్చిన
మధురమైన ముచ్చట!!
ఇచ్చిపుచ్చుకునే ఇంగితాలు
మాటల మార్మికతల మజ్బూరియాల పయనంలో
పట్నం అమాంతంగా పల్లె తల్లి సిగనిండా
ప్లాస్టిక్ పువ్వులు నవ్వుతున్న రోజులైనా
రూపాయి బిళ్ళపై మూడు సింహాలు దర్జాగా ఉన్నట్టు
నోటునోటు పై రంగుల హంగులు పొంగేదాకా
పైసలు మాయమైన మార్కెట్ మాయాజాలం ముందు
కన్నులు పట్టని కాంతిరేఖల మధ్యన
చెయ్యి సంచి ఓ అపురూప పదంగా
కవిత్వం అయింది కథనమూ అయ్యింది
పనులు పూర్తిచేసి గలగలా నవ్వే సమయంలో
కూలీ స్పర్శకు పులకించిన చెయి సంచులూ
ఇంటింటి బరువు బంధనాలను తరగని బాధ్యతలను
అరలు అరలుగ దాచిన చెయి సంచులూ
ఎప్పటివో గాని.. ఇప్పటికి మార్కెట్ మాయాజాలాల
బజారులో ముసలమ్మల చీర పైట వెనుక దాగిన
ముతకవాసనల చెయిసంచులు
అక్కడక్కడా తళుక్కుమంటున్నవి
ఓల్డ్ కాయిన్స్ కలెక్షన్స్
అలవాటుదారులకు దారి దీపమయి
మరువలేని అమ్మ మాటలా
గలగలల సంగీతమూ అయ్యింది చెయిసంచి
– డాక్టర్ కొండపల్లి నీహారిణి