ఢాకా, నవంబర్ 17: మానవత్వానికి వ్యతిరేకంగా క్రూర నేరాలకు పాల్పడ్డారనే కారణంతో బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనాకు (Sheikh Hasina) మరణశిక్ష (Death Penalty) విధిస్తున్నట్లు ఆ దేశ ప్రత్యేక ట్రిబ్యునల్ సోమవారం తీర్పు ప్రకటించింది. షేక్ హసీనా పరోక్షంలో విచారణ జరిపిన ట్రిబ్యునల్ హసీనా ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేసిన సదుజ్జమాన్ ఖాన్ కమల్‌కు కూడా ఉరిశిక్ష విధించింది. కమల్ కూడా బంగ్లా నుంచి పరారై భారత్‌లో తలదాచుకుంటున్నారు. గత ఏడాది నిరసనకారులపై హసీనా ప్రభుత్వం దారుణ మారణహోమానికి పాల్పడిందని, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినందుకు హసీనాకు మరణశిక్ష విధిస్తున్నట్లు బంగ్లాదేశ్‌లోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్(ఐసీటీ) తన తీర్పును ప్రకటించింది. వందలాది మంది నిరసనకారులను ఊచకోత కోసి హింసాత్మక అణచివేత చర్యలకు పాల్పడినందుకు 78 సంవత్సరాల ఆవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనాను దీని వెనుక ప్రధాన వ్యూహకర్త, ప్రధాన సూత్రధారిగా ఐసీటీ అభివర్ణించింది. పెద్ద ఎత్తున ఎగసిన నిరసనలకు వెరచి గత ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన హసీనా అప్పటి నుంచి భారత్‌లో నివసిస్తున్నారు. హసీనాను పరారీలో ఉన్న నేరస్థురాలిగా బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం గతంలో ప్రకటించింది.
హసీనాను అప్పగించాలి: బంగ్లా
షేక్ హసీనాకు మరణ శిక్ష విధించినందున నేరస్థుల అప్పగింత ఒప్పందం కింద తక్షణమే ఆమెను తమ దేశానికి అప్పగించాలని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సోమవారం డిమాండు చేసింది. తమ రెండు దేశాల మధ్య అప్పగింత ఒప్పందం ఉన్నందున హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాల్సిన బాధ్యత భారత్‌కు ఉందని విదేశాంగ శాఖ పేర్కొంది.
భారత ప్రభుత్వ స్పందన
హసీనాకు మరణ శిక్ష విధిస్తూ ప్రత్యేక ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు తమ దృష్టికి వచ్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ(ఎంఈఏ) వెల్లడించింది. బంగ్లాదేశ్‌లో శాంతి, ప్రజాస్వామ్యం, సుస్థిరతను పరిగణనలోకి తీసుకుని సంబంధిత భాగస్వామ్య పక్షాలన్నిటితో నిర్మాణాత్మక చర్చలు జరుపుతామని ఎంఈఏ తెలిపింది. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు తాము కట్టుబడి ఉన్నట్లు ఎంఈఏ పేర్కొంది. అయితే హసీనాను తమ దేశానికి అప్పగించాలని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ చేసిన డిమాండుపై ఎంఈఏ స్పందించలేదు.
వివాహ వార్షికోత్సవం రోజే మరణశిక్ష!
పదవీచ్యుత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నవంబర్ 17వ తేదీని తన జీవితాంతం మరచిపోలేరు. ఇదే రోజున అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యునల్(ఐసీటీ) తనకు మరణశిక్ష విధించినందుకు మాత్రం కాదు. నవంబర్ 17 ఆమె వివాహ వార్షికోత్సవం రోజు. 58 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఆమె బంగ్లాదేశీ భౌతిక శాస్త్రవేత్త వాజేద్ మియాను వివాహం చేసుకున్నారు. హసీనాను దోషిగా తేల్చి ఆమెకు మరణశిక్ష ప్రకటించడానికి కావాలనే ఈ రోజును ట్రిబ్యునల్ ఎంచుకున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అక్టోబర్ 23న ట్రిబ్యునల్ విచారణ పూర్తి కాగా నవంబర్ 13న తీర్పు ఇవ్వాలని మొదట నిర్ణయించారు. అయితే నవంబర్ 17న హసీనాపైన, ఆమె ఇద్దరు అనుచరులపైన తీర్పు వెలువరిస్తామని ఐసీటీ ప్రకటించింది. సెప్టెంబర్ 17 హసీనాకు చాలా ప్రత్యేకమైన రోజని, 1967లో ఆమెకు అదే రోజున వివాహమైందని సెంట్రిస్ట్ నేషన్ టీవీ తన ఫేస్బుక్లో తెలిపింది. బంగ్లాదేశ్ వ్యవస్థాపకులలో ఒకరైన షేక్ ముజిబూర్ రహ్మాన్ రెండవ కుమార్తె హసీనా.
ఈ తీర్పుకు విలువ లేదు: హసీనా
తనకు మరణ శిక్ష విధిస్తూ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై హసీనా స్పందించారు. ప్రజస్వామిక తీర్పు లేని, ప్రజలు ఎన్నుకోని ఓ ప్రభుత్వం నియమించిన నకిలీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుగా ఆమె వర్ణించారు. ఈ తీర్పు మోసపూరితమైనదని పేర్కొన్నారు. ట్రిబ్యునల్‌లోని సభ్యులు పక్షపాతం, రాజకీయ దురుద్దేశం కలవారిగా ఆమె ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న చివరి ప్రధానమంత్రిని అడ్డు తొలగించుకుని ఆవామీ లీగ్‌ని అంతం చేసేందుకు తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న తీవ్రవాద శక్తుల హంతక నైజాన్ని ఈ తీర్పు బయటపెడుతుందని ఆమె పేర్కొన్నారు. తనపై ఆరోపణలను హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) వద్ద ఉంచాలని తాను ముందు నుంచి కోరింది ఇందుకేనని ఆమె పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌లో పార్లమెంటరీ ఎన్నికలు జరగడానికి కొన్ని నెలల ముందు ఈ తీర్పు వెలువడడం గమనార్హం. షేక్ హసీనాకు చెందిన ఆవామీ లీగ్ పార్టీని వచ్చే ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయకుండా తాత్కాలిక ప్రభుత్వం నిషేధం విధించింది. కాగా, గత ఏడాది జూలై-ఆగస్టులో విద్యార్థుల నాయకత్వంలో జరిగిన నిరసనలపై అప్పటి ప్రభుత్వం అత్యంత అమానుషంగా అణచివేత చర్యలు చేపట్టిందని, ఈ చర్యల వెనుక హసీనా ఉన్నట్లు రుజువైందని ఢాకాలోని కోర్టులో ఐసీటీ తన తీర్పును వెలువరిస్తూ స్పష్టం చేసింది. దాదాపు నెల రోజులపాటు జరిగిన నిరసనలలో 1,400 మంది మరణించినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన హక్కుల కార్యాలయం ఓ నివేదికను విడుదల చేసింది.