Tiger Estimation | అటవీ, జంతు ప్రేమికులకు శుభవార్త. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పులులను లెక్కించేందుకు తమతో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర అటవీ శాఖ పిలుపునిచ్చింది. అఖిల భారత పులుల లెక్కింపు (AITE )2026 కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తిగల వలంటీర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి ఎంపికైన ప్రతి వలంటీర్ కూడా అటవీ సిబ్బందితో కలిసి రోజుకు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో నడుస్తూ అడవుల్లో పులుల జాడలు, అడుగుల ముద్రలు, మల చిహ్నాలు, నివాస నాణ్యత వంటి వివరాలను సేకరించాలి.
వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 23వ తేదీల మధ్యల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మూడు వేలకు పైగా అటవీ బీట్లలో ఈ పులుల లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేందుకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జంతు ప్రేమికులు, సాధారణ ప్రజలకు వలంటీర్లుగా అవకాశం ఇస్తారు. దీనికి సంబంధించి దరఖాస్తుల నమోదును మంగళవారం నుంచే ప్రారంభించారు. ఆసక్తిగల వారు ఈ నెల 22 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అనుకునేవారు https://tinyurl.com/aite2026tg ద్వారా సైనప్ అయ్యి గూగుల్ డాక్యుమెంట్లో దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. దీనిపై మరిన్ని వివరాలకు 1800 425 5364 నంబర్‌కు కాల్ చేసి లేదా 980999866 నంబర్లో వాట్సాప్‌లో సంప్రదించవచ్చని సూచించారు. లేదంటే aite2026tg@gmail.com మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
– ఈ కార్యక్రమంలో పాల్గొనే వలంటీర్లు 18 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉండాలి.
– రోజుకు 10 నుంచి 12 కిలోమీటర్ల వరకు అడవుల్లో నడిచే సామర్థ్యం ఉండాలి.
– తక్కువ సౌకర్యాలతో, క్యాంపుల్లో అడ్జస్ట్ అవ్వగలగాలి.