Rahul Ravindran | ‘అందాల రాక్షసి’తో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆయన దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నవంబర్ 7న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న రాహుల్, ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య చిన్మయి శ్రీపాద మంగళసూత్రం ధరించడంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. పెళ్లి తర్వాత మహిళలు తప్పనిసరిగా మంగళసూత్రం ధరించాలి అనే ఆచారం నేను సమర్థించను. అది పూర్తిగా నా భార్య చిన్మయి ఇష్టం. నేను ఎప్పుడూ ఆమెపై బలవంతం చేయలేదు. ఒక మహిళ మెడలో తాళి ఉంటేనే ఆమె పెళ్లయిందని ఎందుకు గుర్తించాలి? మగవాడికి అలాంటి గుర్తు ఉండదు కదా? ఇది లింగ వివక్షలోకి వస్తుంది. సమాన హక్కులు రావాలంటే ఇలాంటి పాత ఆచారాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది,” అన్నారు.
అయితే ఆయన వ్యాఖ్యలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్ర ప్రతిస్పందనలు వస్తున్నాయి. కొందరు నెటిజన్లు రాహుల్‌ను, చిన్మయిని తిట్టిపోస్తున్నారు. “నీ భార్య తాళి వేసుకోదు… నువ్వు జంధ్యం వేసుకున్నావా?”, “హిందూ సంప్రదాయాల్ని ఎందుకు అవమానిస్తున్నావు?”, “మంగళసూత్రం వేసుకోకపోతే పెళ్లి ఎందుకు చేసుకున్నావు?” అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో రాహుల్ అభిప్రాయాన్ని సమర్థించే వర్గం కూడా ఉంది. “ప్రతి ఒక్కరికీ తన ఆలోచన స్వేచ్ఛ ఉంది. రాహుల్ చెప్పింది తప్పేమీ కాదు. సమాజం మారాలంటే ఇలాంటి ఆలోచనలు అవసరం,” అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక చిన్మయి కూడా సోషల్ మీడియాలో తన భర్తకు మద్దతుగా ఘాటుగా స్పందించింది. ఒక నెటిజన్ “మంగళసూత్రం స్త్రీకి భద్రతను ఇస్తుంది” అని రాయగా, చిన్మయి కౌంటర్ ఇస్తూ, “మంగళసూత్రం మహిళలపై లైంగిక దాడులు, వేధింపులను ఆపలేదు. పుట్టిన శిశువులపైనా దారుణాలు జరుగుతున్నాయి. అప్పుడు ఒక మంగళసూత్రం ఎలా రక్షిస్తుంది?” అంటూ కౌంటర్ ఇచ్చింది.
ఈ వ్యాఖ్యలతో రాహుల్–చిన్మయి దంపతులపై సోషల్ మీడియాలో చర్చ చెలరేగింది. కొందరు “సాంప్రదాయాలను తక్కువ చేసి చూపిస్తున్నారు” అంటుండగా, మరికొందరు “వాళ్లు చెప్పింది ఆలోచించాల్సిన విషయం” అని సమర్థిస్తున్నారు. అయితే ఈ వివాదం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందే రావడంతో, సినిమాపై ఎఫెక్ట్ పడొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా రిలీజ్ సమయంలో ఇలాంటి సున్నితమైన విషయాలపై వ్యాఖ్యలు చేయడం రిస్క్ అని, కొన్నిసార్లు అవి రిజల్ట్‌పై కూడా ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.