నల్లగొండ రూరల్, మే 14 : హోటల్లు, బేకరీలలో, నాణ్యత ప్రమాణాలతో పాటు పరిశుభ్రత పాటించకుండా ఆహారాలను అమ్మితే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి సూచించారు. గురువారం ఆయన నల్లగొండ పట్టణంలోని శివాజీనగర్, రామగిరి, హైదరాబాద్ రోడ్, ఎన్జీ కళాశాల పరిసర ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఆకస్మికంగా తనిఖీ చేసి అనంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మాట్లాడారు. డ్రైవ్‌లో భాగంగా వీధి వ్యాపారులు, టీ దుకాణాలు, ఫుడ్ కోర్టులు, బేకరీలు, హోటళ్లు తదితర ఆహార వ్యాపార సంస్థలను తనిఖీ చేశారు. వంట నూనెలను టీపీసీ మీటర్‌తో పరీక్షించడంతో పాటు టీ పొడి, పాలు, మిరప పొడి, పసుపు నమూనాలను ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్‌లో పరీక్షించారు. తాగునీటి నమూనాలను కూడా పరిశీలించారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల్లో పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని వ్యాపారులకు సూచించారు.

నల్లగొండ పట్టణంలో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ఆకస్మిక తనిఖీలు
వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం, గ్లౌజులు, హెడ్ క్యాప్స్ వినియోగించడం, పరిశుభ్రమైన దుస్తులు ధరించడం, ఆహార పదార్థాలను మూతపెట్టి ఉంచడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వీధి వ్యాపారులు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ నాణ్యమైన, సురక్షితమైన ఆహార పదార్థాలను మాత్రమే ప్రజలకు అందించాలని అధికారులు కోరారు. వాడిన వంట నూనెలను పూర్తిగా తొలగించి కొత్త నూనెలను వినియోగించాలని సూచించారు. నూనెలను పరిమితికి మించి వేడి చేయరాదని, టీపీసీ శాతం 25 శాతానికి మించకూడదని తెలిపారు. అలాగే వాడిన వంట నూనెలను ఇతరులకు విక్రయించకుండా, ఎఫ్ఎస్ఎస్ఏఐ రూకో (RUCO) పథకం కింద నమోదు చేసుకున్న అగ్రిగేటర్లకే విక్రయించాలని సూచించారు. ఈ విధంగా విక్రయిస్తే వాడిన నూనెలకు నగదు చెల్లించి సేకరిస్తారని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సురక్షిత ఆహార విక్రయాలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఆయన వెంట సిబ్బంది వెంకటపతి వంశీ పాల్గొన్నారు.

నల్లగొండ పట్టణంలో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ఆకస్మిక తనిఖీలు