కార్పొరేషన్, మార్చి 19: నగరాలు, పట్టణాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పది పాయింట్ల ప్రోగ్రాంను 2022-23 ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా అన్ని మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 17న జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ ఈ కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలోని కరీంనగర్ నగరపాలక సంస్థతో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమాలను వచ్చే ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభించి ఆ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తయ్యేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పది పాయింట్ల ప్రోగ్రాంలో ప్రతి మున్సిపాలిటీలో నాన్వెజ్-వెజ్ మార్కెట్లు, వైకుంఠధామం, ఇంటింటికీ మంచినీటి సరఫరా, మాస్టర్ ప్లాన్, డిజిటల్ డోర్ నంబర్, టీఎస్ బీపాస్, గ్రీనరీ బడ్జెట్, మెకానైజ్ దోబీఘాట్లు, ట్రీట్మెంట్ ప్లాంట్, బయోమైనింగ్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గడువులోగా వీటిని పూర్తి చేసేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్కు సూచించారు.