కరీంనగర్, మే 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ గూండాలు దాడి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడికి యత్నించిన ఘటనపై బీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. దాడి విషయం తెలిసి పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ బీజేపీ మూకలు ధ్వసం చేసిన అద్దాలు, కిటికీలు, ఫర్నిచర్, కౌశిక్‌రెడ్డి ఫార్చూనర్ వాహనాన్ని చూసిన నాయకులు, శ్రేణులు ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. తర్వాత పెద్ద ఎత్తున అందోళనకు దిగారు. కార్యాలయం వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించడంపైనా మండిపడ్డారు. తమ కార్యాలయంపై దాడి చేయడమే కాకుండా పోలీసులు తమనే అడ్డుకుంటున్నారని అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ‘బండి సంజయ్ డౌన్‌డౌన్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

నగరంలోని బీజేపీ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ శ్రేణులు బయలుదేరేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయం ఎదుట రోడ్డుపై నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకొని క్యాంపు కార్యాలయంలోకి పంపించారు. కరీంనగర్‌లోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బండి సంజయ్‌కి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్, కార్పొరేటర్లు యూసు ఫ్, గడ్డి ప్రదీప్, అలీ, మాజీ కార్పొరేటర్లు డిండిగాల మహేశ్, బోనాల శ్రీకాంత్, ఐలేందర్‌యాదవ్, ఎడ్ల అశోక్, వాల రమణారావు, బీఆర్ఎస్ నాయకులు గంటల రేణుక, శ్రీనివాస్‌రెడ్డి, వసంతరావు, ఆరె రవి, ఎండీ సైఫ్, ఓలాల శ్రీనివాస్‌గౌడ్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.