కోదాడ, నవంబర్ 19 : సీఎం రిలీఫ్ ఫండ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానలో మృతి చెందిన రిమాండు ఖైదీ రాజేశ్ పోలీసుల చిత్రహింసల వల్లే మృతి చెందాడని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, దళిత సంఘాల నేతలు, పలు పార్టీల నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం కోదాడలోని గాంధీనగర్ ప్రధాన రహదారిపై వారు రాజేశ్ మృతదేహంతో బైఠాయించి ధర్నా చేపట్టారు. రాజేశ్ మృతికి బాధ్యుడైన చిలుకూరు ఎస్సైపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే ధర్నా వద్దకు వచ్చి రాజేశ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్‌గ్రేషయా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
ధర్నాను ఉద్దేశించి ధర్మ సమాజ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, తదితర నేతలు మాట్లాడుతూ రాజేశ్ పోలీసుల లాఠీ దెబ్బలవల్లే మృతి చెందాడని ఆరోపించారు. రాజేశ్ మృతితో వారి కుటుంబం రోడ్డున పడిందని, సంపాదించే కొడుకు చనిపోవడంతో వృద్ధురాలైన తల్లి, వికలాంగుడైన తమ్ముడు అనాథలయ్యారని ప్రభుత్వం వెంటనే దిగివచ్చి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే పద్మావతి తక్షణమే సంఘటనా స్థలానికి వచ్చి రాజేశ్ కుటుంబానికి భరోసా ఇవ్వాలన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి కోదాడ, హుజూర్నగర్ ప్రజలు తమ బిడ్డలని చెబుతుంటారని, మీ నియోజకవర్గంలోని ఓ దళిత బిడ్డ పోలీసుల దెబ్బలతో మృతి చెందడంతో కుటుంబం బజారున పడిందని, ఔదార్యంతో వ్యవహరించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రాజేశ్ మృతదేహంతో ఆందోళన చేస్తున్న నాయకులతో కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ చర్చించారు. కుటుంబాన్ని ఆదుకుంటామని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇందిరమ్మ ఇల్లు, మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని వారు తిరస్కరించారు. తక్షణమే కలెక్టర్ స్పందించి రూ. 50 లక్షల ఎక్స్ష్రియా ప్రకటించాలని, లేకుంటే ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడబోనని విశారదన్ మహరాజ్ ఆర్డీవోకు స్పష్టం చేశారు. ఆందోళనను విరమింపజేసేందుకు డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి పర్యవేక్షణలో సీఐలు, చరమందరాజు, శివశంకర్ నాయక్, ముగ్గురు ఎస్సైలు 70 మంది పైగా పోలీసులు మొహరించారు.