ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో మైలురాయిని చేరుకుంది. గగన్‌యాన్ యాత్రలో మరో ముందడుగు వేసింది. నవంబర్ 7న మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన పరీక్షల్లో ఎల్వీఎం3 రాకెట్‌ను నడిపించే సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్‌ను కొత్త ‘బూట్‌స్ట్రాప్ మోడ్’లో విజయవంతంగా స్టార్ట్ చేసింది. దాదాపు పది సెకన్ల పాటు ఈ పరీక్ష నిర్వహించినట్లు ఇస్రో తెలిపింది. ఈ ఇంజిన్ ఇప్పటికే 19 నుంచి 22 టన్నుల వరకూ థ్రస్ట్ స్థాయిలో ప్రయోగాల్లో పని చేసింది. తాజాగా బూట్‌స్ట్రాప్ స్టార్ట్ సాధించడం విశేషం.
అదనంగా ఉండే స్టోర్డ్ గ్యాస్ సిస్టమ్ అవసరం లేకుండానే థ్రస్ట్ చాంబర్, గ్యాస్ జెనరేట్లో మల్టీ ఎలిమెంట్ ఇగ్నిటర్ ఉపయోగించి ఈ విధానం సాధించినట్లు చెప్పింది. ఈ కొత్త స్టార్ట్ అప్ టెక్నిక్ సహాయంతో ఇంజిన్‌లోని టర్బోపంపులు తానే వేగంగా పెంచుకుంటూ స్థిరస్థితికి చేరుతాయని.. దాంతో రాకెట్ బరువు తగ్గి, సామర్థ్యం పెరుగుతుందని తెలిపింది. ప్రయాణంలో ఇంజిన్‌ను మళ్లీ మళ్లీ ఆన్-ఆఫ్ చేసే సామర్థ్యం సైతం పెరుగుతుంది. బహుళ కక్ష్య ప్రయోగాలు, కాంప్లెక్స్ మిషన్ ప్రొఫైల్స్, ముఖ్యంగా మనుషుల్ని అంతరిక్షంలోకి పంపే ప్రయోగాలకు ఇది ఎంతో కీలకం. గగన్‌యాన్ మిషన్‌కు ఈ టెక్నాలజీ మరింత వేగాన్ని ఇచ్చినట్లయ్యింది.
ఈ ప్రయోగంతో భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి చేస్తున్న ప్రయోగాలు మరింత విజయవంతమయ్యాయి. ఈ పరీక్షలో థ్రస్ట్ చాంబర్‌ను ఇగ్నిషన్ చేసిన తర్వాత, ట్యాంక్ హెడ్ కండిషన్స్‌లో గ్యాస్ జనరేటర్‌ను మండించి, స్టార్ట్-అప్ సిస్టమ్‌ను ఉపయోగించకుండా టర్బోపంప్ను ప్రారంభించారు. ఆ తర్వాత, ఇంజిన్ బూట్-స్ట్రాప్ మోడ్ బిల్డ్-అప్, స్టెడి-స్టేట్ ఆపరేషన్ విజయవంతమయ్యాయి. ఈ విజయంతో ఇస్రో ఎలాంటి సహాయక స్టార్ట్-అప్ సిస్టమ్ లేకుండా గ్యాస్-జనరేటర్ సైకిల్ క్రయోజెనిక్ ఇంజిన్ బూట్-స్ట్రాప్ మోడ్ స్టార్టింగ్‌ను విజయవంతంగా ప్రదర్శించింది. బహుశా ప్రపంచంలోనే తొలిసారి కావొచ్చు. భవిష్యత్‌లో ఎల్వీఎం 3 ఫ్లయిట్ రీస్టార్ట్ సామర్థ్యం, మిషన్ ఫ్లెక్సిబిలిటీని పెంచే దిశగా ఇది మైలురాయని ఇస్రో పేర్కొంది.