తిండి కలిగితే కండ కలదోయ్ అన్నట్టే, కొవ్వు పెరిగితే.. గుండె జబ్బు కలుగోయ్ అంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. గుండె ఆరోగ్యానికీ, శరీరంలో కొవ్వుకీ సంబంధం ఉంది. గుండెలో ఉన్న సమస్యకు, శరీరంలో ఉన్న కొవ్వుకి ఒకటే పరిష్కారం. వ్యాయామం. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు. గుండె ఆరోగ్యాన్ని పెంచుకునే వ్యాయామం చేస్తూ.. కొవ్వుని తగ్గించేలా కొన్ని నియమాలు పాటిస్తే డబుల్ బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
అదేమిటంటే… ట్రెడ్ మిల్ మీద కేవలం పరుగే కాక నడకనూ అలవాటు చేసుకోవాలి. రోజువారీగా ట్రెడ్ మిల్ మీద పరుగెత్తే సమయంలో పది నుంచి పన్నెండు శాతం తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. ఈ సమయాన్ని నడకకు కేటాయించాలని చెబుతున్నారు. ఆ నడక కూడా ట్రెడ్ మిల్ మీదే. నడకలోనూ వేగం ఉండాలన్నది నిబంధన. గంటకు రెండు నుంచి మూడు మైళ్ల వేగంతో ట్రెడ్ మిల్ స్పీడ్‌ని సెట్ చేసుకోవాలి.
ఈ వేగంతో 30 నిమిషాల నుంచి 60 నిమిషాల పాటు వాక్ చేయాలి. ఇలా వారంలో మూడుసార్లు చేస్తే శరీరంలోని కొవ్వు నిల్వలు కరిగిపోవడంతోపాటు రక్తంలోని గ్లూకోజ్ అంతా ఖర్చవుతుందట. కొత్తగా కొవ్వు పేరుకునేకి ఆస్కారమూ ఉండదు. సుదీర్ఘమైన స్పీడ్వాక్ గుండె వేగాన్ని మెరుగుపరుస్తుంది. రెండు సమస్యలూ ఉన్నట్లయితే.. మీ వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్ సలహా తీసుకున్న తర్వాతే ట్రెడ్ మిల్ మీద ముందడుగు వేయండి.