మేడ్చల్, ఫిబ్రవరి9(నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి వివిధ పార్టీలు ప్రజల మద్దతు కూడగట్టుకోవడంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఎల్లంపేట్, అలియాబాద్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీలలో ప్రచారంలో ముందున్న బీఆర్ఎస్కు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి వారం రోజుల పాటు ప్రచారం చేసారు.
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
మూడు మున్సిపాలిటీలలో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే అని మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల ఎన్నికల నోటిఫికేషన్ రాకముందుగానే అభ్యర్థుల ఎంపికను పూర్తిచేశారు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్రచారాన్ని ప్రారంభించి ప్రజల వద్దకు వెళ్లారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించి మోసం చేసిన తీరును ప్రచారం చేశారు. హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్దిచేప్పేలా బీఆర్ఎస్కు ఓట్లు వేయాలని ప్రజలను కోరారు.
అలియాబాద్లో బీఆర్ఎస్ ప్రచార జోరు
శామీర్ పేట, ఫిబ్రవరి 9: అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ శ్రేణులు దూసుకెళ్తున్నాయి. అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి, మలాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు నంబర్ 8 బండి లక్ష్మీరాంరెడ్డి, వార్డు నంబర్ 9 యమునా శ్యామ్, వార్డు నంబర్ 17 ముద్దం మధుసూదన్ రెడ్డి, వార్డు నంబర్ 18 సగ్గు శ్రీనివాస్ యాదవ్, వార్డు నంబర్ 19 గుర కుమార్ యాదవ్ తరఫున ఓటర్లను కలిసి మద్దతు కోరారు. ప్రచారంలో పాల్గొన్న మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొని కారు గుర్తుకు ఓటువేయాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, మోహన్ రెడ్డి, నందు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.