Film Federation | తమ జీతాలు పెంచాలంటూ తెలుగు సినీ పరిశ్రమలోని కార్మికుల ఆందోళన మరింత ఉధృతమైంది. ఆదివారం ఉదయం ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద 24 యూనియన్లకు చెందిన సినీ కార్మికులు పెద్ద సంఖ్యలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమ డిమాండ్లకు అనుగుణంగా నినాదాలు చేస్తూ నిరసనను వ్యక్తం చేశారు.
వేతనాల పెంపుపై శనివారం నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. నిర్మాతలు మూడు కేటగిరీలుగా కార్మికుల వేతనాలను పెంచుతామని ప్రతిపాదించారు. అయితే, ఈ ప్రతిపాదనపై కార్మిక సంఘాలు సంతృప్తి చెందలేదు. నిర్మాతల నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని, ఆదివారం నుంచి తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ కార్యాలయం వద్ద భారీగా కార్మికులు ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఈ వివాదం తెలుగు చలనచిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.