Love OTP | శ్రీమతి పుష్ప మణిరెడ్డి సమర్పణలో భావప్రీత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అనీష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘లవ్ ఓటీపీ’. విజయ్ ఎం రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజీవ్ కనకాల, జాన్విక కీలక పాత్రలో నటించిన ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంతో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్లో రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. లవ్ ఓటీపీ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో చిత్రీకరించామని తెలిపారు. ఈ సినిమాతో అనీష్ తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగుపెడుతున్నారని పేర్కొన్నారు. రాజమౌళిలా అన్ని క్రాఫ్ట్‌ల మీద పట్టున్న అనీష్‌కు మంచి పేరు రావాలని ఆకాంక్షించారు.
హీరో, దర్శకుడు అనీష్ మాట్లాడుతూ .. ‘హీరో అవ్వాలని చిన్నప్పటి నుంచీ కలలు కంటుండేవాడిని. అదే విషయాన్ని మా నాన్న గారికి చెప్పాను. ఆయన సాయంతో ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాను. వైజాగ్ మూర్తి వద్ద యాక్టింగ్ నేర్చుకున్నాను. అల్లు అర్జున్‌తో కలిసి షెడ్డులో డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాను. ‘నెలవంక’ మూవీ ఓపెనింగ్స్‌కి బన్నీ కూడా గెస్టుగా వచ్చారు. అయితే ప్రొడక్షన్లోకి వద్దు అని బన్నీ సలహా ఇచ్చినా నేను వినలేదు. ఆ మూవీ తరువాత నేను కన్నడకు వెళ్లిపోయాను.’ అని తెలిపారు. ‘గౌతమ్ తిన్ననూరి కూడా మంచి స్నేహితుడు. ‘మళ్లీ రావా’ కూడా మిస్ అయింది. ఎప్పటి నుంచో మళ్లీ తెలుగులోకి రావాలని చాలా ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాను. మళ్లీ ఇప్పుడు ఇలా ఇన్నేళ్లకు టెక్నీషియన్‌గా, దర్శకుడిగా, హీరోగా ఆడియెన్స్ ముందుకు వచ్చాను.’ అని పేర్కొన్నారు. కంటెంట్‌ను నమ్మి ఈ సినిమాను చేశామని అన్నారు. అందుకే 10 రోజుల ముందే ఈ సినిమాను మీడియాకు చూపించాలని అనుకుంటున్నామని వెల్లడించారు. అందరూ చూసి ఈ సినిమాను సపోర్ట్ చేస్తారని ఆకాంక్షించారు.