హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ఆదివాసీ గిరిజన హకుల కోసం గోండువీరుడు కుమ్రంభీం జరిపిన ఆత్మగౌరవ పోరాటం.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాలకు స్ఫూర్తిని నింపిందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. కుమ్రంభీం జయంతిని పురస్కరించుకొని బుధవారం ఆయన చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కుమ్రంభీం త్యాగాలను కేసీఆర్ స్మరించుకున్నారు.
జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరాడిన కుమ్రంభీం ఆశయాలను పదేండ్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలుచేసి, ప్రగతి ఫలాలను చివరి ఆదివాసీ గడప వరకూ చేర్చామని తెలిపారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా, ఆదివాసీ గిరిజన ప్రజల సబ్బండ వర్ణాల అభ్యున్నతికి పాటుపడటం ద్వారానే ఆయనకు ఘన నివాళి అర్పించిన వారమవుతామని పేర్కొన్నారు.