ముంబై, ఏప్రిల్ 11: వడ్డీ రేట్లు పెరుగుతాయన్న భయాలతో అంతర్జాతీయ మార్కెట్లు క్షీణించిన ప్రభావం సోమవారం భారత్ స్టాక్ సూచీలపై పడింది. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 483 పాయింట్లు తగ్గి 58,965 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇదేబాటలో 109 పాయింట్లు నష్టపోయి 17,675 పాయింట్ల వద్ద నిలిచింది. ఐటీ కంపెనీలు క్యూ4 ఆర్థిక ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్తగా ఆషేర్లను విక్రయించారని, అలాగే క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ షేర్లలో సైతం అమ్మకాలు జరిపినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని, దాంతో ఆ దేశపు కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపును వేగవంతం చేస్తుందన్న భయాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయని, ఈ కారణంగా సోమవారం ఆసియాలో ప్రధాన మార్కెట్లన్నీ తగ్గాయి. ఈ సెంటిమెంట్ ఇక్కడి స్టాక్ప్పై ప్రసరించిందని కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు.
సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 2.73 శాతం తగ్గింది. ఇతర ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్ 2.67 శాతం, విప్రో 2.16 శాతం మేర క్షీణించాయి. లార్సన్ అండ్ టూబ్రో, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు 1-2.7 శాతం మధ్యలో తగ్గాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌యూఎల్, టైటాన్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, ఎయిర్‌టెల్‌లు స్వల్పంగా నష్టపోయాయి. మరోవైపు ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, మారుతి సుజుకి, సన్‌ఫార్మాలు స్వల్పంగా లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 1.46 శాతం, టెక్ ఇండెక్స్ 1.37 శాతం మేర తగ్గాయి. క్యాపిటల్ గూడ్స్, టెలికం, సూచీలు 1.09 శాతం, 0.60 శాతం చొప్పున పడిపోయాయి. బీఎస్ఈ పవర్ ఇండెక్స్ 5.18 శాతం, యుటిలిటీస్ సూచి 5.09 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 2.38 శాతం చొప్పున ర్యాలీ జరిపాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సమావేశం కానుండటం, అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు జాగురూకత వహించారని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అలాగే త్రైమాసికం ప్రాతిపదికన ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉంటాయన్న అంచనాలు సైతం మార్కెట్ క్షీణతకు దోహదం చేసిందన్నారు.
న్యూఢిల్లీ: దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ మార్కెట్ విలువ రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. కంపెనీ షేరు ధర భారీగా లాభఫడటంతో కంపెనీ మార్కెట్ విలువ రికార్డు స్థాయికి దూసుకెళ్లింది. దేశీయ కార్పొరేట్ సంస్థల జాబితాలో టాప్-10లోకి వచ్చింది. సోమవారం కంపెనీ షేరు ధర 16 శాతం లాభపడటంతో మార్కెట్ విలువ రూ.4,22,526.28 కోట్లకు చేరుకున్నది. ఇంట్రాడేలో షేరు విలువ 20 శాతం లాభపడి రూ.2,788.70 వద్దకు చేరుకున్నది. దీంతోపాటు భారతీ ఎయిర్టెల్ కూడా టాప్10లోకి వచ్చింది.
కంపెనీ మార్కెట్ విలువ (రూ. లక్షల కోట్లలో)
రిలయన్స్ 17.65
టీసీఎస్ 13.52
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 8.29
ఇన్ఫోసిస్ 7.43
ఐసీఐసీఐ బ్యాంక్ 5.27
హెచ్‌యూఎల్ 5.08
ఎస్బీఐ 4.59
బజాజ్ ఫిన్ 4.44
హెచ్డీఎఫ్సీ 4.39
అదానీ గ్రీన్ 4.22
భారతీ ఎయిర్టెల్ 4.16