రామగిరి, జనవరి 1: గంట వ్యవధిలో తండ్రీ కొడుకు అనారోగ్యంతో మృతిచెందారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రాజేశం (56) పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. ఇంటి వద్ద చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 1.45 గంటలకు మృతిచెందాడు. అప్పటికే రాజేశం రెండో కొడుకు శ్రీకాంత్ (37) బుధవారం రాత్రి ఛాతిలో తీవ్రమైన నొప్పితో అస్వస్థతకు గురికాగా, హుటాహుటిన గోదావరిఖనిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తండ్రి మరణించిన గంట వ్యవధిలోనే 2.30 గంటల సమయంలో శ్రీకాంత్ దవాఖానలో మృతి చెందాడు.
మలక్‌పేట, జనవరి 1: కూతురు ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ట్యాంక్‌బండ్ సందర్శనకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం చెందిన విషాద ఘటన గురువారం వాహెద్‌నగర్‌లో చోటుచేసుకుంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుపతిరావు, వెంకటమ్మ దంపతులు కొత్తపేటలో నివాసముంటున్న కూతురుని చూసేందుకని వచ్చారు. వీరు వాహనంపై ట్యాంక్‌బండ్ సందర్శనకు బయల్దేరగా, వాహెద్‌నగర్ హైటెక్ గార్డెన్స్ సమీపంలో ఆర్టీసీ బస్సు వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో భార్యా భర్తలిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.