గద్వాల, జనవరి 1 : సంవత్సరాలు మారుతూ క్యాలెండర్లు మారుతున్నా.. నిరుద్యోగులకు రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ మాత్రం మారడం లేదని నిరుద్యోగ జేఏసీ నేతలు నిరసన తెలిపారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించగా.. బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కురువ పల్లయ్య సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను రేవంత్రెడ్డి సర్కార్ మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినా నేటికీ జాబ్ క్యాలెండర్ అమలు చేయకుండా నిరుద్యోగులకు తీవ్ర ద్రోహం చేస్తున్నదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చి.. గద్దెనెక్కిన తర్వాత ఆ మాటే మరిచారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ది జ్యాబ్ క్యాలెండర్ కాదని.. జోక్, దగా క్యాలెండర్ అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.