Agriculture | మాగనూర్ : ఇటీవల కురిసిన వర్షాలతో వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండు, మూడు దఫాలుగా కురిసిన వర్షాలకు కొందరు విత్తనాలు నాటగా, మరికొందుకు నాటేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి నిలువునా ముంచుతున్నారు. రైతులకు సరైన అవగాహన లేక వ్యాపారులు సూచించిన విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. నాటిన విత్తనాలు మొలకెత్తక.. మళ్లీ విత్తనాలు కొని చేసిన కష్టం భూమిపాలు కాగా, ఆర్థికంగానూ నష్టాలకు గురవుతున్నారు. నకిలీ విత్తనాలు అమ్మకుండా అధికారులు కొంత మేర చర్యలు చేపడుతున్నా.. కొందరు వ్యాపారులు గుట్టుగా నకిలీ విత్తనాలు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.
☞ వ్యవసాయశాఖ లైసెన్స్ పొందిన డీలరు నుంచే రైతులు విత్తనాలు కోనుగోలు చేయాలి.
☞ సీల్ సరిగ్గా ఉన్న బస్తాలను, ధ్రువీకరణ పత్రం (ట్యాగ్) ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి.
☞ బస్తా ప్యాకెట్‌పై గడువు తేదీ, రకం పేరు, లాట్ నంబర్లను గమనించాలి.
☞ కొనుగోలు బిల్లుతోపాటు నెంబర్, విత్తనరకం, గడువు తేదీ ఉండేలా డీలర్ సంతకంతో కూడిన రసీదు పొందాలి.
☞ రైతు సంతకం కూడా బిల్లుపై ఉండేలా చూసుకోవాలి.
☞ ప్రైవేటు విత్తన సంస్థలు చేసే ప్రచారానికి ఆకర్షితులై విత్తనాలు కొనుగోలు చేయరాదు.
☞ విత్తనాన్ని ఎంచుకునే ముందు వ్యవసాయ అధికారి, శాస్త్రవేత్తల సూచనలు తీసుకోవాలి.
☞ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సరఫరా చేసిన విత్తనాలుంటే వాటిని తీసుకోవడం ఉత్తమం.
☞ ఎరువులను లైసెన్స్ ఉన్న దుకాణాల్లొనే కొనాలి. కొనుగోలు చేసిన ఎరువులకు సంబంధించిసరైన బిల్లులు పొందాలి.
☞ డీలర్ బుక్‌లో రైతువిధిగా సంతకం చేయాలి.
☞ మిషన్కుట్టు ఉన్న ఎరువు బస్తాలు మాత్రమే కొనాలి.
☞ సీసంతో సీల్ ఉందో లేదో నిశితంగా పరిశీలించాలి.
☞ బస్తాపై ప్రామాణిక పోషకాలు, ఉత్పత్తిదారుల వివరాలు ఉండాలి.
☞ కొనుగోలు చేసిన ఎరువులు విషయంలో ఏదైనా అనుమానం వస్తే వెంటనే వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం అందించాలి.
రైతులు విత్తనాలు కొనేముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన విత్తనాలు కొనుగోలు చేయడం మంచింది. అలాగే క్రిమి సంహారక మందులు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో గడువు తేదీ, విత్తనరకం తదితర వివరాలను గమనించాలి. కొనుగోలుకు తప్పనిసరిగా రశీదు పొందాలి.
– సుదర్శన్ గౌడ్, ఏవో, మాగనూరు