
రాకేశ్ టికాయిత్
న్యూఢిల్లీ, అక్టోబర్ 29: ఇకపై పండిన పంటను విక్రయించడానికి రైతులు పార్లమెంటుకు వెళ్తారని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి రాకేశ్ టికాయిత్ అన్నారు. రైతు ఉద్యమం నేపథ్యంలో టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో వేసిన బారికేడ్లను పోలీసులు తీసివేశారు. దీనిపై శుక్రవారం టికాయిత్ స్పందించారు. ‘పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని ప్రధాని మోదీ అన్నారు. స్థానిక మార్కెట్లలో కొనుగోలు చేయని పంటను ఎక్కడ అమ్మాలో.. మేము ఇప్పుడు రైతులకు చెప్తాం. రోడ్లను తెరువగానే ఢిల్లీకి వెళ్లి.. పార్లమెంటు ముందు పంటను అమ్ముతాం’ అన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా 11 నెలలుగా రైతులు నిరసనలు కొనసాగిస్తున్నట్టు గుర్తుచేశారు. రోడ్లు తెరిచిన నేపథ్యంలో భవిష్యత్ కార్యచరణపై త్వరలో ప్రకటిస్తామన్నారు. తామెన్నడూ రోడ్లను దిగ్బంధించలేదని రైతునేతలు పేర్కొన్నారు. పోలీసులు తాజాగా బారికేడ్లను తొలగించడం తమ వ్యాఖ్యలను నిజం చేస్తున్నదని తెలిపారు.