‘ఈ పంట పండిచ్చుడెందుకు? పండీయకెందుకు? ఎండకు ఎండుతున్నం.. మలమల మాడుతున్నం.. కొన్నోడు లేడు.. కొల్సుకున్నోడు లేడు.. 20 రోజులుగా ఇదే గోస.. అరిగోస’.. ఇది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ద్వారకపేట రోడ్ పక్కన వడ్లు ఆరబోసి కుప్పనూడుస్తున్న మహిళా రైతు ఆవేదన. ఇది మునుపెన్నడూ లేని దైన్యం. పదేండ్ల కేసీఆర్ హయాంలో వాడకట్టున కొనుగోలు కేంద్రం, కోత కోసినప్పటి నుంచి వారం తిరగకముందే రైతు బ్యాంకు ఖాతాలో వడ్లు అమ్మిన సొమ్ము జమ. బస్తకు 3 కిలోల కోత, కాంటాకు ఇంత దోపిడీ ఉండకపోయేది.
తరలింపు కోసం ఇన్ని రోజులు పడిగాపులు పడకపోయేది. కాలు మీద కాలేసుకొని రైతన్న దర్జాగా బతికేది. ఇప్పటిలా ఎవుసం కాళ్లు ఇరిగే కాలం వస్తుందని రైతు కలలో కూడా ఊహించలేదు. కనికరం లేని కాంగ్రెస్ సర్కార్ రైతును నిండా ముంచుతున్నది. రోజుల తరబడి రోడ్ల మీదున్న వడ్లు రైతును చూసి కన్నీరు కారుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును చూసి సిగ్గుపడుతున్నది. తరుగు.. కాంటా పేరుతో దోపిడీ.. లారీ కిరాయి.. దానికి వెయిటింగ్ చార్జీ.. హమాలీ.. కూలీ.. ఇలా అన్నితీర్లా భరించినా ఆఖరికి పరాయిలా మారుతున్నది. ఈ అరిగోసల కాలం పోయేదెన్నడని బెంగటిల్లుతున్నది.
కింటన్కు 8 బస్తాలు కట్ చేస్తాండ్లు. ఈ తీరుగ ఎప్పుడు చూడలే. నేను 18 ఎకరాల పంట పండిచ్చిన. ఈ పద్దెనిమిది ఎకరాల్లో నా సంతం ఐదు ఎకరాలు. మునాబు (కౌలు) పదమూడు ఎకరాలు. రైతుకు ఈయేడంత దరిద్రం ఎప్పుడులేదు. అందరూ రైతును ముంచుడే. 1200 బస్తాలు తెచ్చిన. ఇప్పటికీ 350 బస్తాలు ఎత్తిన (కాంటా అయినవి). ఈ 350 బస్తాలకే 6 కింటాండ్ల తరుగుపోయింది. ఇదివరకు బస్తకు అరకిలో.. కిలో తరుగుతీసేది. కానీ, ఎప్పుడు లేంది ఈసారి లెక్కబెట్టి తీస్తాండ్లు. బస్త (40కిలోల)కు మూడు కిలోల చొప్పున. తాలు అంటాండ్లు.. ఇంకేదో అంటాడ్లు.. ఇంకేదో అంటాండ్లు.. వడ్లు మంచిగ ఉంటెనే. ఇగ మంచిగలేకపోతే వాళ్లనోటికి మొక్కాలే. వాళ్ల కోతకు మొక్కాలే. ఇసొంటి కాలం ఎప్పుడు చూడలే.
– చీర శ్రీనివాస్, రైతు, ద్వారకపేట, నర్సంపేట
ములుగు (నమస్తే తెలంగాణ) : పొలం దుక్కి దున్ని.. నారు పోసిన నాటి నుంచి నీళ్లు కట్టి, మందు చల్లి పంట చేతికి వచ్చిన తర్వాత అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే కట్టింగ్ల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నరు. తేమ వస్తలేదంటున్నరు. కొనుగోలు కేంద్రానికి వడ్లను తీసుకొచ్చి వారమైతాంది. తాలు, చెత్త చెదారం లేకుండా ఉన్న వడ్లకు వంక పెడుతున్నరు. బార్దాన్ కూడా ఇవ్వలేదు. క్వింటాకు 12 కిలోల కట్టింగ్ చేస్తామని అంటే రైతులు ఎవరు ఒప్పుకోలేదు. నాలుగేళ్ల క్రితం బస్తకు, మట్టికి కలిపి రెండు కిలోల చొప్పున కట్ చేసేవారు. వడ్లలో ఏం లేకున్నా ఆరబెట్టాలని, తేమ రావాలని, తూర్పార పట్టాలని రోజుల కొద్దీ ఇబ్బందులు పెడుతున్నారు. ఆఖరికి వాళ్లన్న 12 కిలోల కట్టింగ్‌కు ఒప్పుకునే వరకు ఇలానే చేస్తారని అనిపిస్తున్నది. కష్టపడే రైతులకు ఇంత కష్టం వచ్చినా ఎవరు పట్టించుకుంటలేరు
– చిడెం భాస్కర్, రైతు, ములుగు
టేకుమట్ల : వరి కోసి 15 రోజుల క్రితం వడ్లు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన. ఇప్పటి వరకు కాంటా కాలేదు. నాకన్నా ముందొచ్చినోళ్లయే ఇంకా కాంటాలు కాలేదు. ఇక నా వడ్లెప్పుడు కొంటరో అర్థం కావడం లేదు. పంట పండించడం ఒక ఎత్తయితే అమ్ముకోవడం మరో ఎత్తయితాంది. గతంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదు. అందరి వడ్లు కల్లంలోనే ఉన్నాయి. వర్షం వస్తే పరిస్థితి ఏంటో అర్ధం కావడం లేదు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నది. మిల్లుకు పోయిన లారీలు నాలుగు రోజులైనా తిరిగి రావడం లేదు. ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. లారీలు రాకపోవడంతో చాలా మంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి మిల్లుకు తరలిస్తే రెండు మూడు రోజులైనా అన్లోడ్ కావడం లేదు. దీంతో డబుల్ చార్జీలు చెల్లించాల్సి వస్తున్నది.
– కూర సురేందర్‌రెడ్డి, రైతు, వెల్లంపల్లి, టేకుమట్ల మండలం
పరకాల, మే 20 : ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండుగగా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగగా మార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లా ఉమ్మడి పాలనలోలాగానే వ్యవసాయం దండుగైంది. వ్యవసాయం చేయడంలో గతంలో ఎన్నడూ లేనట్లుగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. వరి సాగు చేసేటప్పుడు సమయానికి యూరియా దొరకలేదు. అష్టకష్టాలు పడి పంట పండిస్తే ఇప్పుడు అమ్ముకోవడానికి ఇంకా ఎకువ కష్టపడాల్సి వస్తున్నది. పరకాలలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి వడ్లను తీసుకొచ్చి 15 రోజులవుతున్నది. బార్దాన్ కోసం క్యూ కట్టాల్సి వచ్చింది. బస్తాలు నింపిన తర్వాత కాంటా కోసం మరిన్ని రోజులు.. కాంటాలైన తర్వాత కూడా ధాన్యం తరలింపునకు ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సి వస్తున్నది. అసలు పంట పండించడం కంటే అమ్ముకోవడమే ఇబ్బందవుతున్నది.
– కుమారస్వామి, పోచారం గ్రామం, పరకాల మండలం, హనుమకొండ జిల్లా
జయశంకర్ భూపాలపల్లి (నమస్తే తెలంగాణ) : గత నెల 22న కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చిన. నేను ఏడు ఎకరాల్లో వరి పండించిన. నెల రోజులవుతున్నా ఇంతవరకు కాంటా కాలేదు. కేంద్రంల వడ్లను కాపాడుకోవడానికి నానా తిప్పలు పడుతున్నం. పొద్దున గొడ్ల నుంచి కాపాడుకోవడానికి కావలి ఉండాలె.. రాత్రి అయితే అడవి పందుల బాధ. నిమిషం లేకపోతే వడ్లన్నీ గొడ్లు బుక్కుతున్నయ్. రాత్రి అడవి పందులు వస్తున్నయ్. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను గొడ్లకు, అడవి పందులకు పెట్టుడైతాంది. హమాలీలున్నా లారీలు లేక వడ్లను కేంద్రంలోనే ఉంచుడైతాంది. ప్రభుత్వం, అధికారులు తొందరగా మా వడ్లు కొని మిల్లులకు పంపించాలె. మిల్లులకు పోయిన లారీలు మళ్లీ తిరిగి వస్తలేవు. నాలాగ చాలా మంది ఉన్నరు. ఓపిక నశించి ఈ రోజు ధర్నా చేసినం. ఎండలో వడ్ల కోసం చాలా ఇబ్బంది పడుతున్నం.
-మహేశ్వర్‌రెడ్డి, రైతు, గుమ్మలపల్లి, కాటారం మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
వర్ధన్నపేట : మార్కెట్‌కు వడ్లు తెచ్చి 40 రోజులైతాంది. పొద్దంతా వడ్ల రాశికాడనే కాపులా ఉంటానం. ఇంటిల్లిపాది కల్లం చుట్టూ తిరిగినా ఇంతవరకు కాంటాలు కాలేదు. సీరియల్ ప్రకారం అని చెబుతాండ్లు కానీ అయిందిలేదు.. పోయిందిలేదు. పదేండ్లు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు రందిలేకుంట ఉండే. కోతలకు ముందే మార్కెట్లకు బత్తాలు వచ్చేది. వడ్ల కాంటాలు కూడా తొందరగా జరిగేది. ఇప్పుడు గట్ల లేదు. ఎన్ని రోజులు తిరిగినా కాంటాలు మాత్రం అయితలేవు. వానొత్తె మా పరిస్థితి ఏందని పొద్దుగూకిందంటే భయమైతాంది. పొద్దున రాశిమీద పరదాలు తీసుడు.. సాయంత్రం మళ్లీ కప్పుడు. ఇదే సరిపోతాంది మాకు. కలెక్టరమ్మా మా బాధలు పట్టించుకోరాదు తల్లి.
– చందు రజిత, మహిళా రైతు, రాయపర్తి
వర్ధన్నపేట : యాసంగి వరి కోసి 15 రోజులు దాటింది. మార్కెట్లకు వడ్లు తెచ్చి ఆరబెట్టినంక రాశిబోసిన. ఇప్పటి వరకు కాంటాలు కాలె. సోమవారం నాడు రోహిణీ కార్తె జొరపడుతాంది. వడ్ల సుట్టే తిరుగుతాన. పెంట మట్టి పొలాలకు తోలుకోలేదు. గడ్డివాములు పెట్టేందుకు వడ్లు అమ్ముడు పోక సమయం దొరుకుతలేదు. అధికారులు కల్లాల మొఖం సూత్తలేరు. వడ్లు ఎక్కడియక్కన్నే ఉన్నై. దొడ్డు వడ్లను దేకుతలేరు. సన్న వడ్లను కొనాలని బతిమిలాడుతున్నం. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎప్పుడో వడ్లు అమ్ముకునేది. అన్ని పనులు చేసుకునేది. గిప్పుడు మా పరిస్థితి అధ్వానంగా తయారైంది. కాంటాలు కాకపోవడంతో శుభకార్యాలకు కూడా వెళ్లకుండా కల్లాల వద్దనే కాపలా ఉంటానం. మా గోస ఏమని చెప్పకోవాలె.
– బొమ్మరబోయిన జంపయ్య, రైతు, రాయపర్తి
మహబూబాబాద్ రూరల్ : కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నం. మార్కెట్లో వడ్లు పోసి ఇప్పటికే 20 రోజులైతాంది. ఇంకా కాంటా కాలే. మాయిశ్చర్ కోసం వారం రోజులు చూసినం. ఏఈవో టోకెన్ ఇచ్చే సరికి పది రోజులు పట్టింది. కాంటా పెట్టమని అడిగితే ఇంక టైమ్ పడుతుందని చెబుతుండ్రు. కాంటాల కోసమే రోజూ ఎదురుచూస్తున్నం.
– వీ యాకూబ్, రైతు, సండ్రాళ్లగూడెం, మహబూబాబాద్