నాంపల్లి, ఆగస్టు 12 : ప్రజా పాలన అంటున్నాం కానీ ప్రజా ప్రభుత్వంలో రైతులు యాప్ లతో రైతులు తిప్పలు పడుతున్నారని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమావేశంలో పాల్గొన్న పలువురు సర్పంచులు ఆయా గ్రామాలలో నెలకొన్న సమస్యలపై వైద్యం, విద్య, వివో భవనాలు బిల్లులపై, కరెంటు, రెవెన్యూ, మిషన్ భగీరథ నీటి సమస్యలపై అధికారులను పలువురు సభ్యులు ప్రశ్నించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొదటి విడత ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక ఇందిరమ్మ కమిటీలతో లబ్ధిదారులను ఎంపిక చేయడం వలన అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఇందిరమ్మ కమిటీ సభ్యులకు సంబంధం లేకుండా అధికారులతో ఎంపిక ఉన్నందున అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేకూరుస్తుందన్నారు.
సాదాబైనామాలు అధికారులు పరిష్కరించకుండా బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారనీ, ఇది మంచి పద్ధతి కాదన్నారు. మునుగోడు నియోజకవర్గంలో నిర్మిస్తున్న చర్లగూడెం, కిష్టరాయినిపెళ్లి ప్రాజెక్టు పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తి అయి ప్రజలకు నీరు వస్తుందని తనకు నమ్మకం లేదన్నారు. మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యాధికారి రోగులకు అందుబాటులో ఉండడం లేదని ఆమెపై డీఎంహెచ్ఓకి, జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రామకృష్ణ శర్మ, డిప్యూటీ తాసీల్దార్ దోటీ వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, సర్పంచులు కడారి శ్రీశైలం యాదవ్, ఏరెడ్ల నారాయణ రెడ్డి, నక్క చంద్రశేఖర్, సాగర్ల యాదయ్య, పెరికేటి రమేష్, శ్రీనివాసరెడ్డి, చందూలాల్, గోవర్దన్, ఏసు, పర్వతాలు, వంశీ, మండల అధికారులు పాల్గొన్నారు.