హుజూరాబాద్/ శంకరపట్నం, ఫిబ్రవరి 10: రైతన్నను యూరియా కష్టం వెంటాడుతున్నది. పోయిన వానకాలం పడ్డ బాధలకన్నా ఈ యాసంగిలో రెట్టింపు అనుభవించాల్సి వస్తున్నది. అయితే, ఎరువుల దుకాణాల వద్ద రైతులు లైన్లో ఉండవద్దని, ఎప్పటికప్పుడు స్టాక్ వివరాలు తెలిసేలా, ముందే బుక్ చేసుకొని షాపులకు వెళ్తే ఇచ్చేలా ప్రభుత్వం ఇటీవల ‘ఫర్టిలైజర్ మొబైల్ యాప్’ను తీసుకువచ్చింది. అయితే ఇది నిరక్షరాస్యులు, ఆండ్రాయిడ్ ఫోన్లు లేని రైతులకు తీవ్ర కష్టాలు తీసుకొచ్చింది. వాళ్లు తమ దగ్గర ఉన్న చిన్న ఫోన్లను పట్టుకొని ఫర్టిలైజర్ దుకాణానికి వెళ్తే బస్తాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది.
ఇక ఫోన్లు ఉన్న రైతులు రోజుల తరబడి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఒక్క బస్తా బుక్ కాకపోవడం, కొన్ని సందర్భాల్లో దుకాణాల్లో స్టాక్ ఉన్నా యాప్‌లో నోస్టాక్ కనిపించడం, ఒకవేళ బుక్ చేసుకున్న తర్వాత దుకాణాలకు వెళ్తే సర్వర్ సమస్యతో అక్కడే గంటలతరబడి వేచి ఉండాల్సి వస్తున్నది. ఎవుసం పనులు పక్కన పెట్టుకుని పొద్దంతా రైతులు ఫోన్ చేతిలో పట్టుకుని కూర్చున్నా ఫలితం లేకుండా పోతున్నది. యాప్‌లో స్టాకు ఉందని బుక్ చేద్దాం అనే వరకే నో స్టాక్ అని చూపిస్తున్నది. ఒక వేళ బస్తాలు బుక్ చేసుకుని మరుసటి రోజున సంబంధిత ఎరువుల దుకాణానికి వెళ్తే అక్కడ సర్వర్ రాకపోవడంతో పొద్దంతా వేచి చూడాల్సి వస్తున్నది.
కొంచెం ఆర్థికంగా ఉండి చాతకాని రైతులు, పల్లెలను విడిచి పట్టణాలకు ఉద్యోగరీత్యా వెళ్లిన వాళ్లు, ఎన్నారై రైతులు తమ భూములను కౌలుకు ఇస్తుంటారు. యాప్ వల్ల ఆ భూములను సాగు చేస్తున్న కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. నిబంధనల ప్రకారం భూమి యజయానులే యాప్‌లో యూరియా బుక్ చేయాలి.
ఐడీ నంబర్ షాపులో చెబితే యూరియా బస్తాలు ఇస్తారు. ఎక్కడో ఉన్న యజమానులు కౌలు రైతుల కోసం బుక్ చేసి, ఐడీ నంబర్ చెప్పే పరిస్థితి లేనందున వారికి యూరియా పొందలేని పరిస్థితి వచ్చింది. నిబంధనల ప్రకారం చూస్తే యూరియాను యాప్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఎక్కువలో ఎక్కువగా 60శాతం మందికే సాధ్యమవుతుంది. నిరక్షరాస్యులు, అండ్రాయిడ్ ఫోన్ లేని రైతులు, కౌలు రైతులు బుక్ చేసుకునే వీలు లేదని, నిబంధనలు సడలిస్తే బాగుంటుందనే డిమాండ్ వినిపిస్తున్నది.
ఈ చిత్రంలో ఫీచర్ ఫోన్‌ను చూపిస్తున్న రైతు పేరు నమిండ్ల కొంరయ్య. ఊరు సైదాపూర్ మండలం ఎలబోతారం. ఆయనకు గ్రామంలో నాలుగున్నర ఎకరాల భూమి ఉన్నది. ఈ యాసంగిలో ఇరువై రోజుల కింద మూడెకరాల్లో వరి, ఎకరంలో మక్క సాగు చేశాడు. మొదటి దఫా యూరియా చల్లే సమయం వచ్చింది. నాలుగు బస్తాలు అవసరం ఉండగా, హుజూరాబాద్‌లోని ఓ ఫర్టిలైజర్ దుకాణానికి స్టాక్ వచ్చిందని తెలుసుకొని వెళ్లాడు. అయితే, యాప్‌లో బుక్ చేసుకుంటేనే ఇస్తామని చెప్పడంతో అక్షరం ముక్కరాని కొంరయ్యకు ఏం చేయాలో అర్థం కాలేదు.
పక్కనే ఉన్న మరో రైతు యాప్ గురించి చెప్పాడు. కానీ, కొంరయ్య తనకేమీ సమజు కాలేదని, ఇప్పుడు నేనేం చేయాలని అమాయకంగా అడిగాడు. ఇవన్నీ తనకు తెల్వదని, నాలుగు బస్తాలు ఇస్తే ఇప్పటి మందం సదురుకుంటానని దుకాణపు యజమానిని బతిమిలాడిండు. తన చేతిలో ఏమీ లేదని, పెద్ద ఫోన్లో బుక్ చేసుకుంటే వస్తుందని దుకాణాదారు బదులివ్వడంతో కొంరయ్య ఉత్త చేతుల్తో ఇంటి ముఖం పట్టిండు.