మడికొండ, ఫిబ్రవరి 10 : ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేకపోతున్నామని, ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికలు డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా సమన్వయ అధికారి దాసరి ఉమా మహే శ్వరి సోమవారం 11 మంది విద్యార్థినులను ఇష్టం వచ్చినట్లు కొట్టిందని, ఆందోళనకు గురైన మిగతా వారు మంగళవారం లంచ్ బెల్ మోగగానే గేటు దాటి కలెక్టరేట్‌కు బయలుదేరారు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్, ఎస్సైలు రాజబాబు, రాజ్‌కుమార్‌తో కలిసి సబ్ స్టేషన్ వద్ద విద్యార్థినులను అడ్డుకున్నారు. ఎవరికీ చెప్పా పెట్టకుండా ఇలా వెళ్లడం సరికాద ని, సమస్యలుంటే పరిషరిస్తామని హామీ ఇచ్చినా వారు వినకుండా అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు వచ్చి బతిమాలినా కళాశాలకు వచ్చేందుకు నిరాకరించారు.
చేసేదేంలేక పోలీసులు సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జోనల్ అధికారి అలివేలు ఫోన్లో ప్రిన్సిపాల్‌ను సెలవు పెట్టి వెళ్లాలని ఆదేశించారు. అయినప్పటికీ వినిపించుకోకుండా సస్పెన్షన్ చేయాలంటూ తేల్చిచెప్పడంతో సొసైటీ జాయింట్ సెక్రటరీ శుక్రు నాయక్ ఫోన్ ద్వారా విద్యార్థులతో మాట్లాడారు. 680 మంది స్టూడెంట్స్‌కు మూడు వాష్ రూములే ఉన్నాయని, అందరి ముందు ప్రిన్సిపాల్ ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నదని, తప్పులు చేస్తే పనిష్మెంట్ ఇవ్వండి.. కానీ మితిమీరకుండా ఉండాలని కోరారు. 15 రోజుల్లో పరీక్షలు పెట్టుకొని ఇలాంటి చర్యకు పాల్పడ్డామంటే తాము ఎంత ఇబ్బంది పడుతున్నామో అర్థం చేసు కోవాలని కోరారు. దీంతో ఆయన రెండు రోజుల్లో స్వయంగా తానే వచ్చి విచారణ జరిపి రిపోర్టు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన సూచన మేరకు అక్కడికి చేరుకున్న ఇన్చార్జి జోనల్ ఆఫీసర్ అపర్ణ విద్యార్థులతో మాటాడడంతో ధర్నాను విరమించారు.
విద్యార్థులతో మాట్లాడి వెంటనే నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించడంతో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ నిర్మల, కాజీపేట తహసీల్దార్ సీహెచ్ రాజు, ఇన్చార్జి డీడబ్ల్యూవో విశ్వజ, మల్టీ జోనల్ అధికారి అరుణ కళాశాలకు చేరుకున్నారు. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలు క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు.