న్యూఢిల్లీ: మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పారు. తమ వేదికలలో పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్, డీప్‌ఫేక్ కంటెంట్, ఇతర లోపాలపై ఆయన క్షమాపణలు తెలియజేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మెటా అధికారులతో చర్చలు జరిపిన అనంతరం జుకర్‌బర్గ్ క్షమాపణ తెలియజేశారు. నిర్దిష్ట వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని కొన్ని రకాల కంటెంట్‌ను ప్రచారం చేయడానికి భారీగా డబ్బు చెల్లించినట్టు మెటా అధికారులు అంగీకరించారు. వారు ఈ తప్పునకు క్షమాపణలు చెప్పి విచారం వ్యక్తం చేశారని తెలిసింది.
మూడు రోజుల్లో క్షమాపణలు చెప్పకపోతే…
ప్రధాని మోదీకి సంబంధించిన వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించినందుకు మెటా సీఈవో క్షమాపణ చెప్పాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అంతకుముందు అల్టిమేటం జారీ చేసింది. ఆయనకు కమిటీ మూడు రోజుల సమయం ఇస్తూ దానిని పాటించకపోతే కంపెనీకి ఉన్న చట్టపరమైన రక్షణను రద్దు చేస్తామని హెచ్చరించింది.