న్యూఢిల్లీ, ఆగస్టు 5: నీట్-యూజీ పేపర్ లీకేజ్ నిరసనల సందర్భంగా ఆవిర్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ప్రస్తుతానికి ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. మరొక రాజకీయ పార్టీ కంటే బలమైన పౌర ఒత్తిడి సమూహం భారత్‌కు ప్రస్తుతం అవసరమని వాదిస్తూ తమ సంస్థ ఒక ఒత్తిడి సమూహంగానే తన కార్యకలాపాలు కొనసాగిస్తుందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో కీలక సంస్థాగత సమావేశానికి ముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ జంతర్ మంతర్ నిరసనను సమీక్షించడం, సంస్థను విస్తరించడం, భవిష్యత్తు వ్యూహాన్ని రూపొందించడంపై చర్చలు దృష్టి సారిస్తాయని ఆయన చెప్పారు. విద్యార్థి నిరసనకారులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ కోరేందుకు ప్రభుత్వంతో సంస్థ చర్చలు కొనసాగిస్తున్నట్టు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు.