నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 30: ‘కాలం నెత్తిమీదికొచ్చింది.. ధాన్యం కొనుగోలు ఎప్పుడు పూర్తి చేస్తరు? ఇదే తీరుగ నడిస్తే.. ఇంకా నెల రోజులైనా వడ్లు కొనుడు కాదు.. ప్రభుత్వం, అధికారుల్లో చలనం లేదు. జవాబుదారీ తనం లేదు’ అంటూ రైతులు మండిపడుతున్నారు. నెలన్నర రోజులైనా ధాన్యం కొంటలేరంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రైతులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా రోడ్లెక్కారు.
ఆరు గంటలపాటు అన్నదాతల ఆందోళన
ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి(బీ) వద్ద నిర్మల్-ఆదిలాబాద్ జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు ఏకధాటిగా ఆరు గంటలపాటు ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డుపైనే బైఠాయించారు. మార్క్‌ఫెడ్ డీఎం, ఆర్ఐలు వచ్చి మాట్లాడినా విన్పించుకోలేదు. ధాన్యం కొనాలని అధికారుల కాళ్ల మీద పడి వేడుకున్నారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్ అక్కడికి వచ్చి రైతులతో మాట్లాడారు. రోజూ ఆలూర్ సెంటర్‌కు మూడు లారీలు, రైస్‌మిల్లుల వద్ద ధాన్యం కటింగ్ లేకుండా చూస్తామని, జూన్ 5 వరకు సెంటర్లో ధాన్యం లేకుండా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.
వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం అజ్జమర్రిలో మెదక్-జోగిపేట ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. కేంద్రాలు ప్రారంభించి రెండు నెలలు గడుస్తున్నా గ్రామాల్లో ఇప్పటివరకు సగానికి పైగా ధాన్యం కాంటా పెట్టలేదంటూ యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాకలో రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టిన రైతులు ఆవేదనతో కన్నీరు పెట్టుకున్నారు. ధాన్యం కొనాలని రాజాపేట మండలం నమిలెలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. లారీలు, ట్రాక్టర్లలోని ధాన్యం బస్తాలు అన్లోడింగ్ చేయడం లేదంటూ వనపర్తి జిల్లా రాజపేట శివారులో వనపర్తి-కొత్తకోట రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. మొన్నటి వరకు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో తూకం కోసం రాత్రీపగలు పడిగాపులు కాశామని, ఇప్పుడేమో కాంటా వేసిన ధాన్యాన్ని అన్లోడింగ్ చేయకపోవడంతో మూడ్రోజులుగా ఊరి బయట నిరీక్షించాల్సి వస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అధికారులను నిలదీసిన సర్పంచ్‌లు
‘ధాన్యం కొనుగోలు ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇంకా నెల రోజులైనా వడ్లు కొనేలా లేరు’ అంటూ సర్పంచ్‌లు అధికారులను నిలదీశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీడీవో మేనకా పౌడెల్ అధ్యక్షతన జరిగిన మండల స్థాయి సమీక్షలో పలువురు సర్పంచ్‌లు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు తీరుపై మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించడం లేదని, లారీలు రావడంలేదని, వచ్చినా దిగుమతికి ఐదు రోజులు పడుతున్నదని, దీనికి పరిష్కారం లేదా? అని సర్పంచ్‌లు ప్రశ్నించారు.
అన్‌లోడింగ్‌కు ఆగాల్సిందేనా?
సిద్దిపేట జిల్లా అహ్మద్‌నగర్ వద్ద ఉన్న పత్తి మిల్లు గోదాములో ధాన్యం అన్ లోడింగ్ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. శనివారం ఉదయం మిల్లు పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ధాన్యం లోడుతో వచ్చిన వాహనాలు బారులుతీరాయి.
ధాన్యం నిల్వ తాత్కాలికమే ; నేతన్నల వర్కర్ టు ఓనర్ షెడ్లలో ధాన్యం నిల్వపై అధికారి వివరణ‘నమస్తే’ కథనానికి స్పందన
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో వర్కర్ టు ఓనర్ పథకంలో భాగంగా నేతన్నల కోసం నిర్మించిన వర్క్ షెడ్లలో ధాన్యం నిల్వ తాత్కాలికమేనని పౌరసరఫరాల అధికారి స్పష్టంచేశారు. నేతన్నల కోసం నిర్మించిన షెడ్లలో ధాన్యం నిల్వ విషయమై శనివారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ పేజీలో ‘వర్కర్ టు ఓనర్ షెడ్లలో ధాన్యం నిల్వ’ శీర్షికన వార్త ప్రచురితమైంది. దీనిపై జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ డీ నర్సింహ స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వర్కర్ టు ఓనర్ షెడ్లలో తాత్కాలికంగానే ధాన్యం నిల్వ చేసినట్టు పేర్కొన్నారు. అకాల వర్షాలతో ధాన్యం నిల్వ ఉంచామని వెల్లడించారు. వర్కర్ టు ఓనర్ వర్క్ షెడ్లకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
మోటర్లకు మీటర్లు పెడితే ఉరే

రైతుల ఉచిత కరెంట్‌కు మీటర్లు పెడితే ఇక మాకు ఉరే దికు అని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం ట్రాన్స్ఫార్మర్ వద్ద చేతిలో ఉరితాళ్లు పట్టుకొని నిరసన తెలిపా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి ఆదుకున్న గొప్ప నేత కేసీఆర్ అని కొనియాడారు. నాడు కేంద్రం మోటర్లకు మీటర్లు పెట్టాలని ఎంత ఒత్తిడి తెచ్చినా కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించలేదని స్పష్టంచేశారు. రేవంత్‌రెడ్డి మాత్రం కేంద్ర ప్రభుత్వంతో కలిసి తెలంగాణ రైతుల వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే ఒప్పందం చేసుకున్నట్టు అనుమానం వస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మీనాక్షి, రైతులు పాల్గొన్నారు.

కొనుగోళ్లు సాగడం లేదంటూ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాకలో ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిప్పు పెట్టిన రైతులు

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి(బి) వద్ద ధాన్యం కొనుగోలు చేయాలంటూ అధికారుల కాళ్ల మీద పడుతున్న రైతులు

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం అహ్మద్‌నగర్‌లోని గోదాము వద్ద అన్‌లోడింగ్‌కు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ధాన్యం వాహనాలు