హైదరాబాద్ , సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ) : ఆగస్టులోనే 38% లోటు వర్షపాతం నమోదై ప్రమాద ఘంటికలు మోగినప్పటికీ, మండలాలు, ప్రాజెక్టుల వారీగా పంట-నీటి బడ్జెట్ తయారు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రైతులు సరార్ను నిలదీయకుండా ఉండేందుకే ఫామ్‌హౌస్ యాత్రలు, వినాయక నిమజ్జనంలో కంచె డ్రామాను ముందుకు తెచ్చారన్న విమర్శలొస్తున్నాయి. సమస్య ముంచుకొచ్చిన ప్రతిసారీ ప్రభుత్వం గత పాలకుల ఫామ్‌హౌస్‌లను, హైడ్రా కూల్చివేతలను ముందుకు తెస్తుండటం, ముఖ్యమంత్రిని కాపాడేందుకు బీజేపీ ఏదో ఒక వివాదాన్ని తెరపైకి తేవడం రాజకీయ ఎత్తుగడగానే రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏ ప్రాజెక్టు కింద ఎంత ఆయకట్టుకు ఎన్ని రోజులు నీళ్లు ఇవ్వాలన్న స్పష్టమైన ప్రణాళికను సిద్ధంచేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. దయ్యాలు, మంత్రాలంటూ ప్రజలను తప్పుతోవ పట్టించే ప్రయత్నం చేయగా, బీజేపీ ప్రేరేపిత సంస్థలు దేవున్ని ట్యాంక్‌బండ్‌పై బారికేడ్ల వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ చుట్టూ తిరిగే నోటీసుల పర్వం ఏదో ఒకరోజు ముగుస్తుంది. గణేశ్ నిమజ్జన వ్యవహారం కొద్దిరోజుల్లో పూర్తవుతుంది. కానీ, చేతికొచ్చిన పైరు ఒకసారి ఎండితే మళ్లీ బతుకదని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అన్నదాతను ఆదుకొనేందుకు కాలువల గేట్లు ఎప్పుడు తెరుస్తారో చెప్పాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
రాష్ట్రంలో ఈ వానకాలంలో వర్షపాతం అత్యంత దయనీయంగా పడిపోయింది. ప్రభుత్వ ఆర్థిక, గణాంకాల శాఖ తాజా లెకల ప్రకారం జూన్ 1 నుంచి సెప్టెంబర్ 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా 704.1 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 560.3 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఏకంగా 143.8 మిల్లీమీటర్ల కొరతతో రాష్ట్రంలో 20.4% మేర వర్షపాత లోటు ఏర్పడింది. ఆగస్టులో 38% లోటు వర్షపాతం నమోదవ్వడంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. సెప్టెంబర్ ప్రారంభానికే రాష్ట్రంలో 17 జిల్లాలు లోటు వర్షపాత వర్గంలోకి జారిపోయాయి. మరోవైపు, రాష్ట్రంలోని మొత్తం 44,034 చెరువులు ఉండగా, దాదాపు 40% చెరువుల్లో పావు వంతు కంటే తకువ నీటి నిల్వలు ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.
తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తమకు సహకరించే ప్రభుత్వం లేదన్న ఆలోచనతో ఈసారి రైతాంగం కొంత జాగ్రత్త పడింది. సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గించుకున్నది. రాష్ట్రంలో వానకాలం సాగు గత ఏడాది నమోదైన 139 లక్షల ఎకరాల స్థాయి నుంచి ఈసారి 123లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఈ లెక్కన సాగు విస్తీర్ణం సుమారు 16 లక్షల ఎకరాలకుపైగా తగ్గింది. ఇందులో అధిక నీటి అవసరం ఉన్న వరి సాగు విస్తీర్ణం 18% తగ్గి 49.26 లక్షల ఎకరాలకు పరిమితం కాగా, 48.24 లక్షల ఎకరాల్లో పత్తి, 5.93 లక్షల ఎకరాల్లో మక్కజొన్న, మిగిలినది ఇతర పంటలు సాగయ్యాయి. ప్రస్తుతం వరి పొట్ట దశకు, పత్తి పూత, కాత దశకు చేరుకున్నాయి. ఈ సమయంలో పైరుకు నీరందకపోతే పంట పూర్తిగా ఎండిపోయి పెట్టుబడులు సైతం దకే పరిస్థితి లేదు. నల్లగొండ, సూర్యాపేట, జగిత్యాల, సిద్దిపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంటలను కాపాడుకొనేందుకు చుకనీరు లేక రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వేలాది రూపాయలు పోసి సాగుచేసిన వరి పొలాలను రైతులు గొర్రెలు, మేకల మేతకు వదిలేస్తున్న దృశ్యాలు పల్లెల్లో కంటతడి పెట్టిస్తున్నాయి.
వర్షాలు లేకపోవడంతో ఆయకట్టుకు నీరు రాక రైతులు పూర్తిగా భూగర్భ జలాలు, వ్యవసాయ బోర్లపైనే ఆధారపడాల్సి వచ్చింది. రాష్ట్రంలోని దాదాపు 30 లక్షల వ్యవసాయ బోరుబావుల మోటర్లు నిరంతరాయంగా నడుస్తుండటంతో విద్యుత్తు వినియోగం చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా ఎగబాకినట్టు విద్యుత్తు శాఖ అధికారులు చెప్తున్నారు. సెప్టెంబరు 9న రాష్ట్రంలో ఏకంగా 19,543 మెగావాట్ల ఆల్‌టైమ్ రికార్డు విద్యుత్తు డిమాండ్ నమోదైనట్టు విద్యుత్తు శాఖ నివేదకలు చెప్తున్నాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే డిమాండ్ ఏకంగా 23% పెరిగిందని అంచనా. విద్యుత్తు సంస్థలు డిమాండ్‌ను తట్టుకుని సరఫరా అందించామని చెప్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో లో-ఓల్టేజీ సమస్యలు, అప్రకటిత సాంకేతిక అంతరాయాలతో మోటర్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడం, పొలాలు తడవక ముందే విద్యుత్తు సరఫరాలో లోపాలు తలెత్తడంతో పైర్లు ఎండిపోతూ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
కృష్ణా, గోదావరి బేసిన్లలో ప్రాజెక్టుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రాష్ట్రంలోని మొత్తం జలాశయాల సామర్థ్యం 808 టీఎంసీలు కాగా, అందుబాటులో ఉన్న నీరు 465 టీఎంసీలకు పడిపోయిందని ప్రభుత్వమే అసెంబ్లీ వేదికగా వెల్లడించింది. శ్రీశైలంలో గత ఏడాది ఇదే సమయానికి 153.56 టీఎంసీల నీరుండగా, ప్రస్తుతం 61.65 టీఎంసీలకు, నాగార్జునసాగర్‌లో గత ఏడాది 174.25 టీఎంసీలు ఉంటే, ఇప్పుడు 44.89 టీఎంసీలకు పడిపోయింది. జూరాలకు జూన్ 1 నుంచి సెప్టెంబర్ 21 మధ్య 243 టీఎంసీల వరద వచ్చినప్పటికీ, అందులో 223 టీఎంసీలు దిగువకు తరలిపోయాయి. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటిని సమర్థవంతంగా ఒడిసిపట్టి తమ రైతులకు అందిస్తుండగా, దిగువన ఆంధ్రప్రదేశ్ సైతం కృష్ణా జలాలను తమ రాష్ట్రంలోని చివరి నియోజకవర్గం కుప్పం వరకు తరలించుకుపోతున్నది. తెలంగాణలో మాత్రం ప్రాజెక్టుల నుంచి సాగునీటి కాలువల గేట్లను మూసివేయడం రైతాంగాన్ని తీవ్ర విస్మయానికి గురిచేసింది. జూరాల వద్దకు 80 వేల క్యూసెకుల ఇన్‌ఫ్లో ఉన్నప్పుడే అధికారులు గేట్లు మూసివేసి సాగునీటిని నిలిపివేశారని రైతులు ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ 20న జూరాల ఎడమ కాలువ రైతులు గత్యంతరం లేక స్వయంగా కాలువ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసుకోగా, అధికారులు వెంటనే వచ్చి మళ్లీ మూసివేయడం సంక్షోభ తీవ్రతను స్పష్టం చేస్తున్నదని రైతు సంఘం నేతలు చెప్తున్నారు.
ఇరిగేషన్ శాఖ ప్రణాళికల ప్రకారం కృష్ణా బేసిన్లో మూసీ, డిండి, పాకాల, వైరా వంటి పరిమిత ప్రాజెక్టుల కింద కేవలం 95,108 ఎకరాలకు, గోదావరి బేసిన్‌లోని కడెం, నిజాంసాగర్, దేవాదుల తదితర ప్రాజెక్టుల కింద 6,05,955 ఎకరాలకు కలిపి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 7,01,063 ఎకరాలకు మాత్రమే నీరందించే ప్రతిపాదనలకు పరిమితం కావడం రైతాంగానికి శరాఘాతమైంది. పంటలు చేతికొచ్చే కీలక దశలో గేట్లు మూసివేసి ప్రభుత్వం అనధికారికంగా ‘క్రాప్ హాలిడే’ వాతావరణం సృష్టించిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు జూరాల వద్ద అన్నదాతల పక్షాన నిరసన చేపట్టారు. రాష్ట్రంలో కరువు కోరలుచాచి రైతాంగం మీదపడుతుంటే, బీజేపీ మాత్రం ఉద్దేశపూర్వకంగానే హుస్సేన్‌సాగర్‌లో కంచెల పంచాయితీ పెట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్నేండ్లుగా సంప్రదాయంగా కొనసాగుతున్న గణేశ్ విగ్రహాల నిమజ్జనాన్ని అడ్డుకునేలా హుస్సేన్‌సాగర్ ట్యాంక్‌బండ్ వెంట అధికారులు ఏర్పాటు చేసిన ఇనుప కంచె తీవ్ర దుమారం రేపుతున్నది. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలతో కలిసి బీజేపీ శ్రేణులు ట్యాంక్‌బండ్‌పై బైఠాయించి, స్వయంగా బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. పర్యావరణ నిబంధనల పేరుతో హిందూ పండుగలపైనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నదని, నిమజ్జనానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా హుస్సేన్‌సాగర్‌లోకి అనుమతించాల్సిందేనని బీజేపీ పట్టుబడుతున్నది. రాజధానిలో పట్టు బిగించేందుకు, హిందూ భావోద్వేగాలను రగిల్చి రాజకీయ ప్రయోజనం పొందేందుకు కాషాయ దళం ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా మలచుకున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
రైతాంగ సమస్యలు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే, అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల దృష్టిని మళ్లించే మరో వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం, హరీశ్‌రావు వ్యవసాయ క్షేత్రం, మరో వ్యక్తికి సంబంధించిన జన్వాడ ఫామ్‌హౌస్‌ను కేటీఆర్‌కు ఆపాదిస్తూ భూముల పరిశీలన పేరిట అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రదక్షిణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో రూ.లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపిస్తూ అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయి పరిశీలనల పేరుతో హడావుడి సృష్టిస్తున్నారు.
హైదరాబాద్ విపత్తు నిర్వహణ సంస్థ ‘హైడ్రా’ విచారణల పేరుతో గత పాలకుల అక్రమాలను బయటపెడుతామని కాంగ్రెస్ మంత్రులు ప్రకటిస్తున్నారు. రైతు రుణమాఫీ అమల్లో తలెత్తిన లోపాలు, కౌలురైతుల ఇబ్బందులు, కరువు తీవ్రత వంటి మౌలిక అంశాలపై ప్రజలు సరార్ను నిలదీయకుండా ఉండేందుకే ఫామ్‌హౌస్ యాత్రలు మొదలుపెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరంలో హిందూ ఓటు బ్యాంకును ఏకీకృతం చేసేందుకు వినాయక నిమజ్జనం బారికేడ్ల చుట్టూ బీజేపీ రాజకీయం ఒకవైపు చేస్తుండగా, రైతు సమస్యలకు సమాధానం చెప్పలేక, ఫామ్‌హౌస్‌ల పేరుతో కాంగ్రెస్ నాయకులు నగర శివార్లలో చకర్లు కొడుతూ మీడియా మైలేజీని కాపాడుకొనే తాపత్రయంలో మునిగిపోయారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలే కేంద్రబిందువు కావాలి, కానీ నేడు తెలంగాణలో అన్నదాత పొలాల్లో కన్నీరు కారుస్తుంటే, పాలకులు మాత్రం డైవర్షన్ రాజకీయాల్లో కాలం వెళ్లదీస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.