ఇల్లంతకుంట : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి రైతులు ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు బారులు తీరారు. వరి ప్రారంభ దశలో యూరియా వేయాల్సి ఉంటుంది. కానీ డిమాండ్‌కు సరిపడా రావడం లేదు. దీంతో ఇల్లంతకుంట మండలంలోని సిరికొండ, దాచారం, రామోజిపేట, చిక్కుడువాని పల్లి, అనంతగిరి, తెనుగువానిపల్లి రైతులు ఉదయమే యూరియా కోసం పెద్ద లింగాపూర్ వ్యవసాయ ప్రాథమిక కేంద్రం వద్ద బారులు తీరారు. అనంతరం పంపిణీ ప్రారంభించిన సహకార సిబ్బంది కొద్ది సేపటికే స్టాక్ అయిపోయిదంటూ.. చెప్పారు.
దీంతో గంటల తరబడి వేచి చూసిన రైతులు.. ఉట్టి చేతులతో వెను తిరిగారు. రైతులకు సరిపడా ఎరువులు లేవని ముందే చెప్పి ఉంటే తాము గంటల కొద్ది లైన్లో ఉండేవాళ్లం కాదని రైతులు అవేదన వ్యక్తం చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తమకు సకాలంలో ఎరువులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల్లో ఎరువులు వస్తాయని పీఏసీఎస్ సిబ్బంది రైతులకు నచ్చజెప్పి పంపించారు. వరి పంటకు ఎరువు సమయానికి వేయకపోతే అది ఎదుగుదల లోపిస్తుందని, తద్వారా దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రువుల కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.