మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కల్వకుర్తి: ‘పొలాలకు 24 గంటల కరెంటివ్వడం చేతగాకుంటే పదవి నుంచి దిగిపో రేవంత్‌రెడ్డీ..’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి తన సొంత ఇలాకాలో రైతులు అల్టిమేటం జారీచేశారు. 24 గంటల కరెంటు కొనసాగిస్తాం రైతులకు అది చేస్తాం, ఇది చేస్తామన్న హామీలు ఏమయ్యాయి? ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు చూసి మోసపోయాం.. ఇప్పుడు గోసపడుతున్నాం. ఇగ కాస్కో.. అంటూ సొంతూరు పరిసర గ్రామాల రైతులు హెచ్చరికతో సర్కార్‌కు దిమ్మ తిరిగినంత పనైంది.
కరెంట్ కోతలపై గురువారం కల్వకుర్తి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఏకంగా కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. రైతులంతా రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తంచేశారు. పంటలు ఎండిపోతున్నా సర్కార్ పట్టించుకోవడంలేదని, పక్కనే ఉన్న సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లికి 24 గంటల కరెంటు ఇస్తున్న అధికారులు.. మా పంటలను మాత్రం ఎండబెడుతున్నారని మండిపడ్డారు. కరెంట్ కోతలపై రైతులు తమదైన శైలిలో గొంతెత్తి పాడిన పాటలు అన్నదాతల ఆవేదనను కండ్లకు కట్టినట్టయింది. సుమారు గంటపాటు జరిగిన రాస్తారోకోతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి, వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
మూడురోజుల క్రితమే కల్వకుర్తి విద్యుత్తు ఏడీ కార్యాలయాన్ని ముట్టడించి రైతులు నిరసన వ్యక్తంచేశారు. ఆ తర్వాత పరిస్థితిలో మార్పు రాకపోవడంతో పంటలు కండ్లముందే ఎండుతున్న దృశ్యాలను చూసి చలించిన అన్నదాతలు ఇలా రోడ్డెక్కారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర, తిమ్మరాశిపల్లి, జూపల్లి గ్రామాలకు చెందిన సుమారు 300 మంది రైతులు కొండారెడ్డిపల్లికి కూతవేటు దూరంలో హైవేపై ఆందోళనకు దిగారు.
వ్యవసాయానికి సరిపడా విద్యుత్తు సరఫరా కావడం లేదని, అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదని.. ఫలితంగా తమ పంటలు ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఎర్రటి ఎండలో శరీరం కాలుతున్నా లెక్క చేయని రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. ఆరేడు గంటల కరెంట్‌తో పంటలు ఎండిపోతున్నాయని, ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి 24గంటల విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆవేదనను అర్థం చేసుకోకుండా.. ఎవరెవరు ఈ ఆందోళనలో పాల్గొన్నారు? వారి పేర్లు, చిరునామాలు రాసుకోవడం పోలీసుల వంతయింది. ఘటనా స్థలానికి రావడానికి ముఖం చాటేసిన విద్యుత్తు అధికారులు తమ కార్యాలయాలకే పరిమితమయ్యారు.
కొండారెడ్డిపల్లిలో పంటలు పండాలి.. మిగతా గ్రామాల్లో ఎండిపోవాల్నా?
సీఎం సొంత గ్రామంలో మాత్రమే పంటలు పండాలి? మిగతా గ్రామాల్లో పంటలు ఎండిపోవాల్నా? అంటూ ధర్నాలో రైతులు ప్రశ్నల వర్షం కురిపించారు. కూతవేటు దూరంలో ఉన్న కొండారెడ్డిపల్లిలో వ్యవసాయానికి 24గంటల విద్యుత్తు సరఫరా అవుతున్నదని, తమ గ్రామాల్లో మాత్రం ఆరేడు గంటలకు మించి ఎందుకు కరెంట్ సరఫరా కావడం లేదని రైతులు ప్రశ్నించారు. వేసిన పంటలెండిపోతే తాము బతుకుడెట్లా? అని ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఇస్తే కరెంట్ సక్రమంగా ఇవ్వండి.. లేకుంటే మాకు బతుకుదెరువు చూపించండి’ అంటూ రైతులు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.
24గంటల కరెంటివ్వకుంటే దిగిపో..
అసెంబ్లీ ఎన్నికల ముందు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తానని నమ్మించి మోసం చేసిన రేవంత్‌రెడ్డి.. ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే తన పదవి నుంచి దిగిపోవాలని రైతులు డిమాండ్ చేయడం కలకలం రేపుతున్నది. హామీ ఇచ్చిన విధంగా 24 గంటల కరెంట్ వ్యవసాయానికి ఇవ్వాల్సిందేనని రైతులు స్పష్టంచేస్తున్నారు. ‘మీ ఊర్లో 24 గంటల కరెంటు ఎట్లా వస్తది.. మా ఊర్లల్లో ఎందుకు రాదు’ అంటూ నిలదీశారు. ఒకవైపు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువల్లో కృష్ణా నీటిని కూడా వదలకుండా సర్కార్ చోద్యం చూస్తున్నదని, సొంత ప్రాంతానికి న్యాయం చేసుకోలేకపోతే నీకు ఆ పదవి ఎందుకు దిగిపో.. అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ‘కేసీఆర్ ప్రభుత్వం కష్టకాలంలో కూడా రైతులకు 24గంటల కరెంట్ ఇచ్చింది. ఇప్పుడు మీరెందుకు ఎందుకివ్వడం లేదు’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం అంటేనే భయం వేసే పరిస్థితులు వచ్చాయని వాపోయారు.
కొండారెడ్డిపల్లిని ముట్టడిస్తాం
ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున కొండారెడ్డిపల్లిని ముట్టడిస్తామని ఆ మూడు గ్రామాల రైతులు హెచ్చరించారు. హైవేపై కరెంట్ కోసం ఆందోళనకు దిగిన రైతుల వివరాలు పోలీసులు సేకరిస్తున్నారనే వార్తలొస్తున్న క్రమంలో రైతులు మండిపడ్డారు. పోలీసుల రంగప్రవేశం చేసి రైతులను బలవంతంగా ఆందోళన విరమింపజేశారు. శాంతియుతంగా నిరసన తెలిపితే రై తులపై కేసులు నమోదు చేస్తే.. ఇది మరో ఉ ద్యమానికి దారి తీస్తుందని రైతుసంఘం నా యకులు అంటున్నారు. కరెంట్ అడిగితే కేసు లు నమోదు చేస్తే రైతన్న ఆగ్రహ జ్వాలల్లో ప్రభుత్వం కాలిపోతుందని రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సీఎం సొంతూరుకు 24 గంటల కరెంటు..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లికి 24 గంటల కరెంటు సరఫరా అవుతున్నది. చాలా గ్రామాలు రాత్రిపూట కూడా సింగిల్ ఫేస్ కరెంటు లేక చీకట్లోనే మగ్గుతుండగా, సీఎం సొంతూరు మాత్రం ధగధగా మెరుస్తున్నది. ఇతర గ్రామాలకు కోతలు విధిస్తూ, సీఎం సొంతూరుకు రోజంతా అధికారులు కరెంట్ సరఫరా చేయడంపై విమర్శలకు తావిస్తున్నది. రెప్పపాటు కరెంటు కూడా పోకుండా ఇక్కడ జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే గ్రామాన్ని కేంద్ర ప్రభుత్వ సూర్య ఘర్ పేరిట మొత్తం సోలార్ పవర్‌ను అందించిన అధికార యంత్రాంగం.. తాజాగా కొండారెడ్డిపల్లి చు ట్టుపక్కల ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు నిరంతరం విద్యుత్తును అందజేస్తున్నారు. ఒక్కక్షణం కూ డా కరెంటు పోకుండా అధికార యంత్రాంగం జాగ్రత్త పడుతున్నది. చుట్టుపక్కల ఉన్న గ్రా మాల్లో మాత్రం ఎడాపెడా కరెంటు కోతలు విధిస్తున్నారు. అడుగడానికి వెళ్లిన రైతులపై ఉల్టా దౌర్జన్యాలకు దిగుతున్నారు. మీ ఊరు ఒక్కటే ఏస్తే గెలిచావా? మా తడాఖా ఏందో? ఇప్పుడు చూపిస్తాం.. అంటూ రైతులు చేసిన ప్రతిజ్ఞ సంచలనంగా మారింది.