హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): నాణ్యతలో రాజీలేని విధానాలు పాటించినందుకు టీజీఎస్ఆర్టీసీకి అవార్డులు దక్కాయి. క్వాలిటీ సరిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా(క్యూసీఎఫ్ఐ) హైదరాబాద్ చాప్టర్ నిర్వహించిన 40వ వార్షిక సమావేశం గురువారం హైదరాబాద్‌లోని హోటల్ మేరీ గోల్డ్‌లో ఘనంగా ముగిసింది. రెండు రోజుల సదస్సులో వివిధ సంస్థల నుంచి 200కి పైగా బృందాలు పాల్గొని నాణ్యతా ప్రమాణాల పెంపు, పని ప్రదేశంలో వినూత్న మార్పులు, ఉత్పాదకత పెరుగుదల, అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రదర్శించాయి.
ఇందులో ఆర్టీసీ ఉప్పల్ జోనల్ వర్‌షాప్ నుంచి 4 బృందాలు విశేష ప్రతిభ కనబరిచాయి. నాణ్యతలో రాజీపడకుండా వ్యయ నియంత్రణ(కాస్ట్ కంట్రోల్)పై ఆర్టీసీ అవలంబిస్తున్న ఉత్తమ విధానాలను ప్రదర్శించి ప్రతిష్టాత్మక గోల్డ్ అవార్డులను గెలుచుకున్నాయి. ఢిల్లీలో జరుగబోయే పోటీల్లో ఈ బృందాలు ఆర్టీసీ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాయి. ఈ సమావేశానికి ఆర్టీఐ కమిషనర్ బీ అయోధ్యరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు అభినందనలు తెలిపారు. సిబ్బందిని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి అభినందించారు.