లోవోల్టేజీ సమస్య తలెత్తకుండా నాణ్యమైన కరెంట్‌ను అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం వనపర్తి జిల్లా నాచహల్లి విద్యుత్తు సబ్‌స్టేషన్ వద్ద నాచహళ్లి, సవాయిగూడెం, పెద్దగూడెం, పెద్దగూడెం తండాకు చెందిన రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాసంగి వరికి త్రీఫేజ్ కరెంట్ సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులకు విన్నవించినా పరిస్థితి మెరుగుపడలేదని వాపోయారు.
పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వంలో కరెంట్ సమస్యలు లేవని.. కానీ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి విద్యుత్తు సమస్యలు మొదలైనట్టు చెప్పారు. మరో 20 రోజులు మెరుగైన విద్యుత్తును సరఫరా చేస్తేనే పంటలు చేతికొస్తాయని చెప్పారు. వీరి నిరసనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం సబ్‌స్టేషన్ వద్ద మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. మూడ్రోజుల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో నీళ్లు అందక పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు.
యాసంగిలో వరి సాగుచేస్తున్న రైతులకు నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీరందక పంట ఎండిపోతున్నది. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చండూర్ శివారులో రైతు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి రెండు ఎకరాల్లో వరి సాగు చేశాడు. బోరు ఎండిపోయింది. గింజ గట్టిపడే దశలో నీరు అందకపోవడంతో చేసేదేమీ లేక వరిపంటను వదిలేశాడు. దీంతో ఎండిపోయిన వరి పంట గొర్రెలు, మేకలకు మేతగా మారింది.