నర్సింహులపేట, మే 1 : రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను అరిగోస పెడుతున్నది. ఆరుగాలం కష్టపడి ధాన్యాన్ని పండిస్తే కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టడడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల అలసత్వంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దొడ్డు వడ్లు కొనుగోలు చేయలేమంటూ కొర్రీలు పెడుతున్నారు. మి ల్లర్లు సన్న ధాన్యం మాత్రమే కావాలంటున్నారని మెలికపెడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రెండు వారాలుగా కాంటాలు లే క రైతులు పడుతున్న బాధలు అన్నీఇన్నీ కావు. కొన్ని కేంద్రాల్లో సరిపడా హమాలీలు లేక రైతులే కూలీల అవతారం ఎత్తి బ స్తా లు నింపుతున్నారు. ఇలాంటి స్థితిలో దొడ్డు రకం వడ్లు సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
పై నుంచి అనుమతులు రాలేదని, మిల్లర్లు దొడ్లు వడ్లు వద్దంటున్నారని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. దొడ్డు రకం ఎగుమతి చేయలేకపోతున్నామని, ప్రభుత్వం మాత్రం రేషన్ దుకాణంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నందున కాంటా పెట్టలేమని చెబుతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దొడ్లు వడ్లు తీసుకుంటే నూక శాతం ఎక్కువ ఉంటుందని సాకులు చెప్తున్నారు. వస్రంతండా జీపీ పరిధిలోని కేంద్రాలను డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్ గత నెల 22న ప్రారంభించారు. అప్పటికే రైతులు అక్క డ ధాన్యం ఆరబోశారు. ఏ గ్రేడ్ క్వింటాలుకు రూ.2389, బీ గ్రేడ్ రూ. 2369 వస్తుందన్న అశతో దొడ్డు రకం ధాన్యం తీసుకొచ్చారు. మిల్లర్ల పేరుతో కుంటిసాకులు చూపుతూ కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు వడ్లను తూకం వేయడం లేదు. దీంతో వీటిని ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.
యాసంగిలో నాలుగు ఎకరాల్లో దొడ్డు రకం వడ్లు సాగు చేశా. వస్రంతండా కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చి 15 రోజులు దాటింది. కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసేటప్పుడు అడ్డు చెప్పలేదు. ఇప్పుడు తేమ శాతం వచ్చాక కాంటా పెట్టేందుకు ఇబ్బంది పెడుతున్నారు. సరైన సమాధానం చెప్పకుండా అలస్యం చేస్తున్నారు. ఎండలకు ఇబ్బంది పడుతున్నాం. వడ్లు కాంటా పెట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– బానోత్ శ్రీను, రైతు, హన్మతండా
నేను దొడ్డురకం వరి సాగుచేశాను. ఇటీవల వస్రతండా కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చాను. తీరా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కాంటా పెట్టడడం లేదు. రైస్‌మిల్లర్లు దొడ్డు వడ్లు వద్దంటున్నారని మెలిక పెడుతున్నారు. ఇప్పుడు వీటిని ఎక్కడ అమ్ముకోవాలి. అధికారులు పరిశీలించి ధాన్యాన్ని కొనుగోలు చేయించాలి.
– అజ్మీరా చంద్య, రైతు, గోపతండా