నల్లగొండ ప్రతినిధి, మే22(నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దాంతో జిల్లా అంతటా వర్ష ప్రభావం కనిపించింది. వారం రోజులుగా సూర్య ప్రతాపంతో తల్లడిల్లిన ప్రజానీకం ప్రస్తుత వర్షాలతో ఊపిరి పీల్చుకుంటున్నది. పలుచోట్ల భారీ వర్షం కురువడంతో రైతులు వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతున్నారు. వానకాలం సీజన్ కోసం ఇప్పటికే భూములు చదును చేసుకున్న రైతులతోపాటు మిగతా రైతులు దుక్కులు దున్నే పనిలో పడ్డారు. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం గురువారం తెల్లవారుజాము వరకు జిల్లాలో సగటున 24 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. ఒక్క గట్టుప్పల్ మండలం మినహా మిగతా అన్ని చోట్లా వర్షం ఓ మాదిరి వర్షమైనా కురిసినట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి. అత్యధికంగా తిరుమలగిరి(సాగర్) మండలంలో 79.7మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇక్కడ వర్షానికి వాగులు పొంగి పొర్లడంతో ఓ కుంటకు సైతం గండి పడింది. మరికొన్ని కుంటలు, చెరువుల్లోకి అదనంగా నీరు వచ్చి చేరినట్లు తెలిసింది. నకిరేకల్ మండలంలో 62మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దవూరలో 51 మి.మీ, కనగల్‌లో 46.8మి.మీ, కేతేపల్లిలో 44.3మి.మీ, పీఏపల్లిలో 41.8మి.మీ, హాలియాలో 37మి.మీ, అడవిదేవులపల్లిలో 36.5మి.మీ, దామరచర్లలో 31.9మి.మీ వర్షపాతం నమోదైంది. నిడమనూరు మండలంలో 28.5మి.మీ, తిప్పర్తిలో 28మి.మీ, కట్టంగూర్‌లో 25.9మి.మీ, నార్కట్‌పల్లిలో 23మి.మీ, చింతపల్లిలో 22.1మి.మీ, త్రిపురారంలో 21.9మి.మీ, కొండమల్లేపల్లిలో 21.1మి. మీ, దేవరకొండలో 18.5మి.మీ, మాడ్గులపల్లిలో 17.1మి.మీ, మునుగోడులో 17.1మి.మీ, నల్లగొండలో 15.4మి.మీ, చందంపేటలో 14మి.మీ, గుర్రంపోడులో 14.4మి.మీ, చిట్యాలలో 13.9మి.మీ, మిర్యాలగూడలో 13.1మి.మీ, మర్రిగూడలో 10.9మి.మీ, వేములపల్లిలో 10మిల్లీమీటర్ల వర్షం పడింది.
మిగతా మండలాల్లో 10 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు చేస్తు న్న నేపథ్యంలో జిల్లా అంతటా రైతులు హర్షం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనులకు సన్నద్ధం అవుతున్నారు. నాన్‌ఆయకట్టు ప్రాంతాల్లో పత్తి, ఇతర మెట్ట పంటల కోసం ఇప్పటికే భూములను చదును చేసుకుని సిద్ధంగా ఉన్నారు. అనువైన వర్షాలు కురిస్తే దుక్కులు దున్ని తర్వాత దశలో విత్తనాలు పెట్టే ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు. ఈ నెల 25 నుంచి రోహిణి కార్తె ప్రవేశించనుండడంతో ఈ కార్తెలో విత్తు పడితే పంటలు బలంగా ఎదుగుతాయని రైతులు భావిస్తుంటారు. మరో దఫా సరైన వర్షం కురిస్తే రైతులు పత్తి, కంది వంటి విత్తనాలు పెట్టాలని భావిస్తున్నారు.