కోనరావుపేట/వీర్నపల్లి/చందుర్తి, మార్చి 24: సిరిసిల్ల జిల్లాలో మంగళవారం పడిన అకాల వర్షానికి అన్నదాతలు ఆగమయ్యారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటపై వడగండ్లు పడడంతో పెద్ద మొత్తంలో నష్టపోయారు. కోనరావుపేట మండలం బావుసాయిపేట పరిధిలోని రామన్నపల్లె దాదాపుగా 20మంది రైతులకు చెందిన 80ఎకరాల పంట నేలమట్టమైంది. అలాగే వీర్నపల్లి మండల కేంద్రంతోపాటు లాల్సింగ్తండా, ఎర్రగడ్డతండా, గర్జనపల్లిలో సుమారు వంద ఎకరాలు, ప్రధానంగా లాల్సింగ్తండాలో దాదాపు 30ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లు బాధిత రైతులు వాపోయారు. చందుర్తి మండలం కేంద్రంతోపాటు రామన్నపేట, తిమ్మాపూర్, అశిరెడ్డిపల్లె గ్రామాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. రాష్ట్ర సర్కారు సత్వరమే సర్వే చేయించి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.