న్యూఢిల్లీ, మార్చి 24: యావత్తు ప్రపంచం ఏఐ జపం చేస్తున్న నేపథ్యంలో అమెరికాలోని టెక్సాస్‌లో ‘టెరాఫ్యాబ్’ పేరిట ఓ భారీ చిప్ ఫ్యాబ్రికేషన్ కేంద్రం ఏర్పాటు దిశగా ఎలాన్ మస్క్ వెళ్తున్నారు. ఆస్టిన్లోగల టెస్లా ప్రధాన కేంద్రాలు, గిగాఫ్యాక్టరీలకు సమీపంలోనే నిర్మించనున్న ఈ మెగా ఫ్యాక్టరీలో ఏఐతోపాటు రోబోటిక్స్, అటానమీ, తమ ఆర్బిటల్ డాటా సెంటర్ లక్ష్యాల సాధనకు వీలుగా సొంతంగానే సెమీకండక్టర్లను మస్క్ అభివృద్ధి చేయించనున్నట్టు బ్లూంబర్గ్ సమాచారం.
ఇక ఏఐ, రోబోటిక్స్‌లో మస్క్ పెట్టుబడులను తీవ్రం చేస్తున్న నేపథ్యంలో ఏటా టెరావాట్ కంప్యూటింగ్ పవర్‌ను సాధించేలా ఈ టెరాఫ్యాబ్ కేంద్రాన్ని తీసుకురానున్నట్టు చెప్తున్నారు. కాగా, రెండు రకాల చిప్‌లను తయా రు చేయనుండగా.. ఒకటి భూమిపై టెస్లా రోబోటిక్స్, ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోలలో వాడేలా 100-200 గిగావాట్ల శ్రేణిలో ఉంటుంది. మరొకటి అంతరిక్షంలో స్పేస్ఎక్స్ కంపెనీలు వినియోగించుకునేలా టెరావాటి సామర్థ్యంతో ఉండనున్నది.