బజార్ హత్నూర్ : మండలంలోని రైతులు ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క వానకాలం సీజన్లో విత్తనాలు విత్తు కోవడం ప్రారంభం కావడంతో ఎరువులు అవసరమైన రైతులు దుకాణాల చుట్టు యూరియా, డీఏపీ మందుల కోసం పాకులాడుతున్నారు. మండలంలో యూరియా, డీఏపీ కొరత తీవ్రంగా ఉండడంతో గురువారం ఉదయం 6 గంటల నుంచే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద రైతులు పెద్ద సంఖ్యలో ఎరువుల కోసం పడిగాపులు కాశారు. రానున్న రోజుల్లో ఎరువుల కొరత ఎక్కువగా ఉంటుందన్న ప్రచారంతో ఇప్పటి నుంచే రైతులు ఎరువులు తీసుకోని పెట్టుకుందాం అంటే ముందు నుంచే అంతంత మాత్రన ఎరువులు మండలానికి రావడం తో నానా ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో మండలంలో ఎరువుల కొరతను ఆసరాగా తీసుకున్న కొందరు దళారులు బ్లాక్లో మూడు వేల వరకు అమ్ముతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వంలో పండించిన పంట అమ్ముకున్న డబ్బులు రాక, రైతు భరోసా ఇవ్వక మరో పక్క ఎరువుల కొరతతో అన్ని విధాలుగా రైతులకు కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున ఉన్నత అధికారులు దృష్టి సారించి ఎరువుల కొరత లేకుండా చూడాలని మండల రైతులు కోరుతున్నారు.