భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ‘పేరు గొప్ప – ఊరు దిబ్బ’ అనే నానుడిలా ఉంది భద్రాద్రి జిల్లా మార్కెటింగ్ శాఖ తీరు. మార్కెట్ యార్డులు ఉన్నప్పటికీ అక్కడ మార్కెటింగ్ జరగకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. దీంతో రైతుల పంటలు దళారుల పాలవుతున్నాయి. రూ.కోట్ల ఆదాయం తెచ్చిపెడుతున్న రైతులకు మార్కెట్లు ఏమాత్రమూ ఉపయోగపడడం లేదు.
ఏటా జిల్లాలో రైతులు పండించిన పంటలు దళారుల పాలవడంతో వారు ఆశించిన లాభాలు రావడం లేదు. జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో పంటల సాగవుతున్నప్పటికీ రైతులు వాటిని విక్రయించుకునే ప్రభుత్వం సౌకర్యాలు కల్పించలేకపోతోంది. చివరికి, తేమ శాతం వంటి కొర్రీల కారణంగా వరి ధాన్యాన్ని కూడా చాలామంది రైతులు దళారులకు విక్రయిస్తున్నారు. ఇక అపరాలు, ఇతర పంటలనైతే తప్పని పరిస్థితుల్లో బయట బేరగాళ్లకు అమ్ముకోవాల్సి వస్తోంది. అదీ లేకపోతే సంతల్లోకి వెళ్లి విక్రయించాల్సి వస్తోంది.
భద్రాద్రి జిల్లాలోని మార్కెటింగ్ యార్డుల నిర్వహణ ఇప్పటికీ ఉమ్మడి జిల్లా పరిధిలోనే జరుగుతోంది. భద్రాద్రి జిల్లాలో భద్రాచలం, బూర్గంపహాడ్, చర్ల, దమ్మపేట, ఇల్లెందు, కొత్తగూడెంలలో ఆరు మార్కెట్ యార్డులు ఉన్నాయి. వీటికి అనుసంధానంగా 19 నాబార్డు గోదాములు కూడా ఉన్నాయి. వీటి ద్వారా ఏటా రూ.2,265 కోట్ల ఆదాయం మార్కెటింగ్ శాఖకు సమకూరుతోంది. కానీ, వచ్చిన ఆ ఆదాయంతో రైతులకు ఉపయోగపడే సదుపాయాలను కల్పించలేకపోతోంది. గోదాముల ద్వారా కూడా నెలకు రూ.10 లక్షల ఆదాయం వస్తోంది. దీంతోపాటు భద్రాచలం, కొత్తగూడెం మార్కెట్ యార్డుల పరిధిలో షాపింగ్ కాంప్లెక్స్‌లు కూడా ఉన్నాయి.
వీటి ద్వారా కూడా రూ.లక్షల ఆదాయం సమకూరుతోంది. కానీ, రైతులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. గతంలో కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో రైతుబజార్ ఉండేది. ఇప్పుడు అది కూడా లేకపోవడంతో రైతులు తాము పండించిన పంటలను విక్రయాలు చేసుకోలేక సంతలకు పరిమితమవుతున్నారు. జిల్లాలో ఆరు మార్కెట్ యార్డులు, దానికి సంబంధించిన చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ వాటి పరిస్థితి ‘ఎక్కడ వేసిర గొంగళి అక్కడే..’ అన్నట్లుగా ఉంది. ఏ యార్డు చూసినా పెద్దపెద్ద చెట్లు పెరిగి కన్పిస్తోంది. వర్షం వస్తే కొత్తగూడెం మార్కెట్ యార్డంతా బురదమయమవుతోంది. అదే ప్రదేశంలో రైతులకు ఇవ్వాల్సిన యూరియా నిల్వలు ఉంచడం వల్ల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అదే ఆవరణలో పశువుల ఆసుపత్రి కూడా ఉండడంతో పశువులు రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటోంది.
జిల్లాలో అన్ని చోట్ల పంచాయతీల పరిధిలోనే మార్కెట్ యార్డులున్నాయి. పెద్ద మార్కెట్ ఏర్పాటుకు ప్రయత్నం జరుగుతోంది. కానీ, కొన్ని నిబంధనలు అడ్డొస్తున్నాయి. కొత్తగూడెం పట్టణంలో ఉదయం వేళ యార్డులోకి లారీలు రావాలంటే ట్రాఫిక్ రూల్స్ ఉంటున్నాయి. గతంలో ఒక ప్రయత్నం చేశాం. ట్రేడర్స్ ముందుకొచ్చినా రైతుల ప్రోత్సాహం కూడా ఉండాలి. జూలూరుపాడు కేంద్రంగా ప్రభుత్వం 10 ఎకరాల స్థలం కేటాయించింది. నిధులు కూడా మంజూరయ్యాయి.
-నరేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి, భద్రాద్రి
భద్రాద్రి జిల్లా పెద్దది అయినందువల్ల చాలా మంది రైతులు వేలాది ఎకరాల్లో అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఒక్క ధాన్యం తప్ప వేరే పంటలేవీ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. ఒక్కోసారి పత్తి, వరి వంటలను కూడా దళారులకే విక్రయించాల్సి వస్తోంది. అన్ని ఏరియాల్లో మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి.
-భూపతి రమేశ్, రావికంపాడు, చుండ్రుగొండ
మా ప్రాంతంలో అన్ని పంటలలనూ సాగు చేస్తాము. కానీ, వాటిని విక్రయించుకునేందుకు తగినన్ని మార్కెట్లు లేవు. చివరికి రైతుబజార్లకు వెళ్లి అమ్ముకోవాల్సి వస్తోంది. మార్కెటింగ్ సౌకర్యం ఉంటే రైతులకు కూడా ధైర్యంగా ఉంటుంది. మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు జరగాలంటే ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి.
-ఆంగోత్ లఘుపతి, వెంకటియాతండా, టేకులపల్లి