దోమ, జూన్ 13 : ధాన్యం వర్షార్పణం కావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం రాత్రి, శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి మండలంలోని పాలేపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. నీట మునిగింది. వానలు కురుస్తున్నా ఇప్పటికీ ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రానికి సక్రమంగా లారీలు రాకపోవడంతోనే కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నట్టు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. వరి నార్లు చల్లుకు నే సమయం వచ్చినా కొనుగోలు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముజాహిద్పూర్ కొనుగోలు కేంద్రంలో
కులకచర్ల : మండలంలోని ముజాహిద్పూర్ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తూకం సక్రమంగా సాగకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి వారం రోజులు దాటినా అక్కడి సిబ్బం ది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. గత 15 రోజుల కిందట కురిసిన వానకు 500పైగా ధాన్యం బస్తాలు తడిసిపోగా..శుక్రవారం అర్ధరాత్రి పడిన వర్షానికి కేంద్రంలో తూకం కోసం తీసుకొచ్చిన ధాన్యం మొత్తం తడిసి ముద్దయిందని రైతులు వాపోతున్నారు. కొందరు రైతులు నేరుగా తమ ధాన్యాన్ని రైస్‌మిల్లుల్లో విక్రయించి బిల్లులు చేయించుకునేందుకు కొనుగోలు కేంద్రానికి వస్తే అక్కడి సిబ్బంది హమాలీ పేరుతో రూ.15 నుంచి రూ.20 వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
తూకం నిరీక్షణ
ముజాహిద్‌పూర్‌లోని కొనుగోలు కేంద్రానికి వారం రోజుల కిందట ధాన్యాన్ని తూకం కోసం తీసుకొచ్చా. ఇప్పటికీ తూకం వేయడం లేదు. ధాన్యాన్ని ట్రాక్టర్లో తీసుకురావడంతో దానికి ప్రతిరోజూ కిరాయి చెల్లించాల్సి వస్తున్నది. ఇంకా ఎన్ని రోజులు ట్రాక్టర్ అద్దె చెల్లించాలి. కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యంతో శుక్రవారం అర్ధరాత్రి కురిసిన వానకు వడ్లు మొత్తం తడిసిపోయాయి. పలుకుబడి ఉన్న వారి ధాన్యా న్ని తూకం వేస్తూ ప్రజలను పట్టించుకోవడంలేదు. -బుగ్గయ్య, రైతు, రాంరెడ్డిపల్లి, కులకచర్ల