హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): జాతీయ ఆస్తుల పరిరక్షణలో సీఐఎస్ఎఫ్ సిబ్బందిది అత్యంత కీలక పాత్ర అని గవర్నర్ ప్రతాప్ శుక్లా అన్నారు. విశ్వాసం, బాధ్యత, అచంచలమైన కర్తవ్యానికి సీఐఎస్ఎఫ్ ప్రతీక అని పేర్కొన్నారు. శనివారం సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్‌తో కలిసి హకీంపేట్‌లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (ఎన్ఐఎస్ఏ)లో నిర్వహించిన 39వ బ్యాచ్ అసిస్టెంట్ కమాండెంట్లు, 9వ బ్యాచ్ సబ్ఇన్స్పెక్టర్ల (మాజీ సైనికులు) దీక్షాంత్ పరేడ్‌ను గవర్నర్ వీక్షించారు.
కాగా, హైదరాబాద్‌లోని ఎన్ఐఎస్ఏ నుంచి 200 మంది అధికారులు విధుల్లోకి చేరనున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 200మంది అధికారుల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సీఏపీఎఫ్ (ఏసీ) పరీక్ష ద్వారా ఎంపికైన 76మంది అసిస్టెంట్ కమాండెంట్లు (వీరిలో అయిదుగురు మహిళా అధికారులు) ఉండగా, 124 మంది సబ్ ఇన్స్పెక్టర్లు (మాజీ సైనికులు) ఫోకస్డ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోర్సును పూర్తిచేశారు.