హైదరాబాద్, సిటీబ్యూరో, జూన్ 13(నమస్తే తెలంగాణ): నగరంలో రోజురోజుకూ తగ్గిపోతున్న పచ్చదనం.. ఎటుచూసినా కాంక్రీట్ కట్టడాలతో నగరవాసులకు ప్రాణవాయువు కష్టంగా మారుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణాన్ని కాపాడాల్సిన కాంగ్రెస్ సర్కార్.. అందుకు భిన్నంగా కొద్దోగొప్పో ఉన్న గ్రీన్బెల్డ్ను నిర్వీర్యం చేస్తున్నది. ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల పేరిట మహా వృక్షాలను సర్వనాశనం చేస్తున్నది. శరవేగంగా తరిగిపోతున్న వృక్ష సంపదతో నగరం అర్బన్ హీట్ ఐలాండ్‌గా మారే ప్రమాదం పొంచి ఉన్నదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ నుంచి లక్డీకాపూల్ జంక్షన్ వరకు రైల్వే ట్రాక్‌కు సమాంతరంగా పబ్లిక్ గార్డెన్ మీదుగా ఓ ఫ్లైఓవర్ వెళ్లేలా అధికారులు డిజైన్లు రూపొందించారు. దీనికి ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపింది.
దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో 180 ఏండ్ల చరిత్ర కలిగిన పబ్లిక్గార్డెన్ను విధ్వంసం చేసేందుకు అడుగులు వేస్తున్నది. ఇదే జరిగితే నగరంలో కొంతమేర ఉన్న పచ్చదనం కూడా కనుమరుగు అవుతుందని నగరవాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నిరుడు గచ్చిబౌలిలో దాదాపు 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న మహా వృక్షాలను రేవంత్ సర్కార్ నేలమట్టం చేసింది. ఈ వివాదం కోర్టు వరకు వెళ్లడంతో వెనుకడుగు వేసింది. అయితే అప్పటికే 90శాతం మేర వృక్షాలు నేలమట్టమయ్యాయి. ఆ తర్వాత నగరానికి ప్రాణ వాయువు అందిందే కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్ కోసం వందలాది వృక్షాలను నరికేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో పర్యావరణవేత్తల పోరాటంతో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో వెనుక్కు తగ్గింది.
ఇప్పుడు తాజాగా 50 ఎకరాల్లో విస్తరించి ఉన్న పబ్లిక్ గార్డెన్‌పై భస్మాసుర హస్తాన్ని ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ట్రాఫిక్ సమస్యను సాకుగా చూపెట్టి మరోసారి పచ్చదనాన్ని విధ్వంసం చేసేందుకు పావులు కదుపుతున్నది. దీంతో కోర్ సిటీలో విస్తరించి ఉన్న అతి స్వల్ప బయో డైవర్సిఫైడ్, హిస్టారికల్ పార్క్‌లు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉన్నదని పర్యావరణవేత్తలు వాపోతున్నారు. ఈ వినాశకర ఫ్లైఓవర్‌తో భవిష్యత్తు తరాలకు నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.