చేతికొచ్చే దశలో ఉన్న పంట ఎండిపోతున్నదని మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం సిద్ధోటం గ్రామానికి చెందిన రైతు తిమ్మగళ్ల వీరస్వామి ఆందోళన చెందుతున్నాడు. వీరస్వామి ఎకరం పొలంలో వరి సాగు చేశాడు. నాటేసిన రెండు నెలల తర్వాత బోరులో నీరు పూర్తిగా అడుగంటింది. ఉన్న బోరులో నీళ్లు రాకపోగా.. వారం కిందట రెండు బోర్లు వేసినా చుక్క నీరు రాలేదు. పంట సాగుకు రూ.40 వేలు, బోర్లేసేందుకు రూ.70 వేలు అప్పు చేశాడు. పంట చేతికొచ్చే సమయంలోనే ఎండిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.
వ్యవసాయ యోగ్యమైన భూమిలన్నింటికి రైతుభరోసా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మూడు ఎకరాలు దాటిన వారికి ఇంతవరకు భరోసా ఇవ్వకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సంగెంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రైతులు నిరసన తెలిపారు. బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. నీళ్లు లేక పంటలు ఎండుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అబద్ధాల సర్కారుకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.