అయిజ : తూకం వేసి నిల్వ చేసిన వరి ధాన్యం తరలించాలని రైతు జమ్మన్న( Farmer Jammanna) డీసీఎం వ్యాన్ ( DCM Van ) కింద పడుకుని నిరసన తెలిపారు. మండలంలోని పులికల్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ( Purchase Centres ) సోమవారం ఒకటి, రెండు లారీలు రాగా తమ ధాన్యం తరలించాలని రైతులంతా డిమాండ్ చేయగా డ్రైవర్లు లారీలను నిలిపివేశారు.
వారం రోజుల క్రితమే ధాన్యం తూకం చేసి 70 బస్తాలను నిల్వ చేశానని, అయినా లారీలు సమయానికి రాకపోవడంతో రేయింబవళ్లు కొనుగోలు కేంద్రంలోని పడిగాపులు కాస్తున్నామని రైతు జమ్మన్న డీసీఎం వ్యాన్ కింద పడుకుని తన ధాన్యాన్ని తరలించాలని నిరసన తెలిపాడు. కాగా వర్షాలు పడుతుండడంతో తమ ధాన్యం తడిసిపోతుందని మిగతా రైతులు వ్యక్తం చేశారు.
ధాన్యం తడిస్తే మిల్లర్లు ధాన్యం తిరస్కరిస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ధాన్యం తరలింపునకు వాహనాలు అధికంగా సంఖ్యలో పంపించాలని డిమాండ్ చేశారు. పులికల్ ఐకేపీ నిర్వహకుల నిర్లక్ష్యంతో వాహనాలు సకాలంలో రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆరోపించారు. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కొనుగోళ్లు కేంద్రాలపై దృష్టి సారించడంలేదని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య ఆరోపించారు. కలెక్టర్ వెంటనే స్పందించి పులికల్ ఐకేపీ కేంద్రం నుంచి తక్షణమే ధాన్యం తరలించే ఏర్పాట్లు చేయాలని కోరారు.