Rajanna Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. సంక్రాంతి పండుగ వేళ పొలానికి వెళ్లిన ఓ రైతు ప్రమాదవశాత్తు మరణించాడు. ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. అక్కపల్లి గ్రామానికి చెందిన రైతు పండుగ గంగయ్య (55) గత రాత్రి సుమారు 7 గంటల సమయంలో తన పొలం వద్దకు వెళ్లాడు. ఒడ్డుపై నడుస్తుండగా కాలు జారి పొలంలో పడిపోయాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో బురదలో ఊపిరాడక కన్నుమూశాడు. రాత్రి పొలానికి వెళ్లి ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో గంగయ్య కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఇవాళ తెల్లవారుజామున పొలానికి వెళ్లిన కుటుంబసభ్యులు గంగయ్య పొలంలో విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించి శోకసంద్రంలో మునిగిపోయారు. మృతునికి భార్య, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.