Akhil Akkineni | సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026 సీజన్లో తెలుగు వారియర్స్ అద్భుతమైన బోణీ కొట్టింది. శనివారం విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియం వేదికగా పంజాబ్ దే షేర్‌తో జరిగిన పోరులో వారియర్స్ 52 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ కెప్టెన్ అక్కినేని అఖిల్ విశ్వరూపం ప్రదర్శించి, ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి సెంచరీ బాదడంతో స్టేడియం హోరెత్తిపోయింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన తెలుగు వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోరు సాధించింది. అఖిల్ కేవలం 56 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలవగా, మరోవైపు అశ్విన్‌బాబు 51 బంతుల్లో 9 ఫోర్లతో 60 పరుగులు చేసి జట్టుకు పటిష్టమైన స్కోరును అందించారు.
అనంతరం 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ దే షేర్ జట్టు తెలుగు బౌలర్ల ధాటికి 18.2 ఓవర్లలోనే 132 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్ జట్టులో కరణ్‌వాణి (56), హర్డీసంధు (28) మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. తెలుగు వారియర్స్ బౌలర్లలో వినయ్ మహదేవ్ 3 వికెట్లు తీయగా, సామ్రాట్ 2 వికెట్లతో రాణించి పంజాబ్ పతనాన్ని శాసించారు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ జట్టు 4 వికెట్ల తేడాతో ముంబయి హీరోస్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లలో అఖిల్ 6 సిక్సర్లు, బెంగాల్ టైగర్స్ ప్లేయర్ జిమ్మీ బెనర్జీ 10 సిక్సర్లు కొట్టడం విశేషం. ఈ అద్భుత విజయంతో తెలుగు వారియర్స్ పాయింట్ల పట్టికలో శుభారంభం చేయడమే కాకుండా అభిమానుల్లో కొత్త జోష్‌ను నింపింది.
@AkhilAkkineni8 Smashed His Century Once Again’ In #CCL2026 #akhilakkineni #TeluguWarriors King 👑 Koduku 🏏🏏🏏🏏 pic.twitter.com/A2sdzA2q93
— Ganesh kinnera (@SilentBoyGanesh) January 17, 2026