US-EU Trade Deal | గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలన్న పంతంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. గ్రీన్లాండ్ విషయంలో తమకు సమర్థించని యూరప్ దేశాలపై 10 శాతం సుంకం విధిస్తామని చేసిన ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ (EU) కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది జూలైలో ప్రకటించిన యూఎస్ – ఈయూ వాణిజ్య ఒప్పందాన్ని ( US-EU Trade Deal ) తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని యూరోపియన్ పీపుల్స్ పార్టీ ఉపాధ్యక్షుడు సిగ్ఫ్రిడ్ మురెసాన్ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా వెల్లడించారు.
“గత ఏడాది జూలైలో కుదిరిన యూఎస్-ఈయూ వాణిజ్య ఒప్పందాన్ని త్వరలోనే రాటిఫై చేయాల్సి ఉంది. ఈ ఒప్పందం ద్వారా అమెరికా నుంచి ఈయూకు వచ్చే దిగుమతులపై సుంకాలను సున్నాకు తగ్గించే అవకాశం ఉండేది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ప్రక్రియను కొంతకాలం వాయిదా వేయాల్సి వస్తుంది” అని సిగ్ఫ్రిడ్ మురెసాన్ తెలిపారు. గత ఏడాది అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే ఏకైక లాభం స్థిరత్వం మాత్రమేనని పేర్కొన్నారు. కానీ ట్రంప్ తాజా ప్రకటనతో ఆ స్థిరత్వం దెబ్బతిన్నదని అన్నారు. అందుకే ఈ వాణిజ్య ఒప్పంద రాటిఫికేషన్ను వాయిదా వేయడం సమంజసమని స్పష్టం చేశారు.
We were supposed to ratify very soon in the European Parliament the EU-US trade deal from last July, reducing tariffs for imports from the US into the European Union to 0%.
That ratification will have to wait a little longer in this new context.
— Siegfried Muresan 🇷🇴🇪🇺 (@SMuresan) January 17, 2026
STABILITY would have been the only gain from last year‘s trade deal between the US and the European Union.
Today’s announcement by President Trump to eventually impose new tariffs on several EU member states takes away that stability.
This is why the postponement of the…
— Siegfried Muresan 🇷🇴🇪🇺 (@SMuresan) January 17, 2026
అంతకుముందు గ్రీన్‌లాండ్‌పై అమెరికా నియంత్రణకు వ్యతిరేకిస్తున్న 8 దేశాలపై భారీగా సుంకాలు విధించనున్నట్లు డోనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించారు. డెన్మార్క్, బ్రిటన్, ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, జర్మనీ, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాల ఉత్పత్తులపై 10 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇవి అమలులోకి వస్తాయని వెల్లడించారు. గ్రీన్లాండ్ కొనుగోలు వ్యవహారంలో సహకరించకపోయినా.. జూన్ 1వ తేదీ నాటికి కొనుగోలు ఒప్పందం పూర్తి కాకపోయినా ఈ 8 దేశాలపై టారిఫ్‌ను 25 శాతానికి పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు.
అమెరికా, యూరోపియన్ యూనియన్ (27 సభ్య దేశాలు) మధ్య గత ఏడాది జూలై భారీ వాణిజ్య ఒప్పందం కుదరింది. ఈ ఒప్పందం ద్వారా యూఎస్, ఈయూ మధ్య ఉన్న పలు టారిఫ్‌లు, వాణిజ్య వివాదాలకు పరిష్కారం లభిస్తుందని అంతా భావించారు. కానీ గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలన్న పంతంతో ట్రంప్ విధించిన టారిఫ్‌ల నేపథ్యంలో యూఎస్ – ఈయూ వాణిజ్య ఒప్పందంలో అనిశ్చిత్తి నెలకొంది.