హైదరాబాద్, మే5 (నమస్తేతెలంగాణ) : వ్యవసాయ రంగంలో కేసీఆర్ పాలన తెచ్చిన సంస్కరణల కారణంగా తెలంగాణలో ఇబ్బడి ముబ్బడిగా పండుతున్న వరి ధాన్యాన్ని కొనలేక కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేస్తున్నదా? మద్దతు ధరతో పాటు, ధాన్యానికి ఇస్తామన్న బోనస్ ఎగవేసే ప్రయత్నం చేస్తున్నదా? పంట ఉత్పత్తులు కొనేందుకు డబ్బులు సర్దుబాటు కాక.. ఏం చేయాలో తెలియక ‘పంట మార్పిడి’ని ముందుకు తెచ్చిందా? అంటే రైతు సంఘాల నుంచి అవును అనే సమాధానమే వస్తున్నది. తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తే ప్రభుత్వమే పంటమార్పిడి వైపు రైతులను మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పంట మార్పిడికి సంబంధించిన నివేదికను సీఎం రేవంత్‌రెడ్డికి రైతు కమిషన్ చైర్మన్ మంగళవారం అందించారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కమిషన్ సభ్యులు భేటీ అయ్యి నివేదికను సమర్పించారు. ఇక్కడ పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కూడా ఉన్నారు. పంట మార్పిడిపై సమగ్ర చర్చ జరపాలని భావిస్తున్న ప్రభుత్వం.. రైతు కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చించాలని భావిస్తున్నది.
పంటలు కొనలేకనేనా?
కాగా ఇప్పటికే పంట కొనుగోలు చేయలేక చేతులెత్తేస్తున్న కాంగ్రెస్ సర్కారే ఇలా ప్రతిపాదనలు ఇప్పించుకున్నది అనే అనుమానాలు రైతు సంఘాల నేతల్లో వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండు సార్లు రైతుబంధు ఎగవేసింది. ధాన్యానికి ఇస్తామన్న రూ.500 బోనస్ పెండింగ్‌లో పెట్టింది. రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా పండుతున్న పంటను మద్దతు ధరకు కొనాల్సి వస్తదని, డబ్బులు సర్దుబాటు కాక, ఏం చేయాలో తెలియక ప్రభుత్వమే పంటమార్పిడిని ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విరివిగా వస్తున్న పంట ఉత్పత్తుల ప్రాసెసింగ్ కోసం యూనిట్ల లాంటి సదుపాయాలు కల్పించడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కార్, పంటమార్పిడితో వీటన్నిటి నుంచీ తప్పుకోవాలని చూస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కేవలం 8 రకాల సన్నాలనే సాగుచేయాలని సూచించడం, సన్నాలన్నీ సన్నాలు కావని చెప్పడం, ఆ మరుసటి రోజే పంట మార్పిడిపై రైతు కమిషన్ నుంచి నివేదిక సర్కార్‌కు అందడం, యూరియా యాప్‌ను కూడా బంద్ పెట్టడంపై రైతు సంఘాల నేతల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరి పంటను తగ్గించడం కోసమే ప్రభుత్వం యూరియా అమ్మకాలను నిలిపివేసిందనే చర్చ నడుస్తున్నది. ఇక మున్ముందు ప్రభుత్వం చెప్పిన పంటలే వేయాలని, భూమి రైతుదైనా పంట సర్కార్దేననే వాదనలు వినిపిస్తున్నాయి.